ఛత్తీస్‌గఢ్ వర్సెస్ కేంద్రం!

by  |
ఛత్తీస్‌గఢ్ వర్సెస్ కేంద్రం!
X

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌కు, కేంద్ర సర్కారుకు మధ్య ఇండైరెక్ట్ ‘వార్’ మొదలైంది. పరస్పరం ఎఫ్ఐఆర్‌లు, తనిఖీలతో కౌంటర్ ఇచ్చుకుంటున్నట్టు తెలుస్తున్నది. మాజీ సీఎం, బీజేపీ నేత రమణ్ సింగ్‌ సన్నిహితుడిపై ఎఫ్ఐఆర్ దీనికి కారణంగా మారినట్టు సమాచారం అందింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం బీజేపీ నేత రమణ్ సింగ్‌కు సన్నిహితుడు, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అమన్ సింగ్‌పై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ తర్వాతి రోజే ఢిల్లీ నుంచి ఐటీ అధికారులు.. డిప్యూటీ సెక్రటరీ, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ భగేల్‌కు సహాయకులుగా పేరున్న సౌమ్య చౌరాసియా నివాసంలో తనిఖీలు నిర్వహించారు. స్టేట్ కామర్స్, ఇండస్ట్రీ జాయింట్ సెక్రటరీ ఏకే తుతేజా, మాజీ ఐఏఎస్ అధికారి వివేక్ ధాండ్, రాయ్‌పూర్ మేయర్ ఎజాజ్ ధేబర్, మద్యం వ్యాపారి పప్పు భాటియా, మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ సింగ్ హోరాలకు సంబంధించినవిగా భావిస్తున్న ఆస్తులపై దాదాపు 300 ఐటీ అధికారులు దాడి చేశారు. తుతేజా, వివేక్ ధాండ్‌లు కాంగ్రెస్ సర్కారుకు ఆప్తులుగా భావిస్తుంటారు. ఈ తనిఖీలపై సీఎం భుపేష్ భగేల్ మండిపడ్డారు. సౌమ్య చౌరాసియా నివాసంపై దాడులను.. రాజకీయ ప్రతీకారంగా.. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రగా ఆరోపించారు.

ఈ తనిఖీలు నిర్వహించిన తర్వాతి రోజు ఐటీ అధికారులు ఉపయోగించిన 19 కార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని రాష్ట్ర పోలీసులు సీజ్ చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం రాయ్‌పూర్ పర్యటించనున్న సందర్భంగా చెక్ చేసినట్టు పోలీసులు తెలిపారు. జరిమానా విధించి రిలీజ్ చేసినట్టు వివరించారు. కాగా, ఐటీ అధికారుల తనిఖీలకు పోలీసులు అంతరాయం కల్పిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

Next Story

Most Viewed