దండకారణ్యం… వైద్య కారుణ్యం

by  |
దండకారణ్యం… వైద్య కారుణ్యం
X

దిశ, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కూలీ పని చేసి తిరిగి స్వగ్రామాలకు చేరిన వారికి పరీక్షలు నిర్వహించాలని ఛత్తీస్‌గఢ్ సర్కార్ నిర్ణయించింది. కరోనా వ్యాధి ప్రబలి లాక్‌డౌన్ అమలు కావడంతో కూలీలు స్వగ్రామాలకు చేరుకున్నారన్న సమాచారం అందుకున్న దంతెవాడ జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఓ మెడికల్ టీంను అటవీ గ్రామాలకు పంపింది. రహదారులు సరిగా లేని కీకారణ్యంలోని ఆ అటవీ ప్రాంతాలకు వెళ్లిన వైద్యులు గిరిజనులను పరీక్షించారు. మావోయిస్టు నేత చైతు దాదాకు అత్యంత పట్టున్న దంతేవాడ కాకాడి, నహరి ప్రాంతానికి వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తారు. కానీ, కరోనా మహమ్మారి అక్కడి అడవి బిడ్డలను కాటేస్తే వారి ప్రాణాలతోపాటు ఆ ప్రాంతవాసుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని భావించిన అధికారులు స్పెషల్ మెడికల్ టీమ్స్‌ను పంపించారు. 150 మంది కూలీలు మిర్చి తోటల్లో పనిచేసేందుకు తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వచ్చి వెళ్లగా ఈ సమాచారం తెలుసుకున్న దంతెవాడ జిల్లా అధికార యంత్రాంగం కూలీలకు వైద్య పరీక్షలు చేయాలని డిసైడ్ అయ్యింది.

దంతెవాడ జిల్లా ఆరోగ్యశాఖకు చెందిన కుకాండ సీఎంహెచ్‌ఓ డాక్టర్ శాండిల్య, ఆర్‌బీఎస్‌కే నోడల్ డాక్టర్ ఎస్.కె. టీమ్ అటవీమార్గం గుండా కీకారణ్యంలోకి వెళ్లింది. ఈ బృందంలో డాక్టర్ లక్ష్మీతోపాటు డాక్టర్ రవి కుమార్ కోరీ, డాక్టర్ నేహా ప్యాక్రా, అంజలి, రాజేశ్వరి, అనురాధ, మహేంద్ర ఉన్నారు. వీరు ఆ గ్రామాలకు చేరుకుని కూలీలను పరిక్షించి హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు.

దండకారణ్య జోన్‌లో….

సౌత్ బస్తర్ ఏరియాలో ఉండే దంతేవాడ జిల్లాలోని కాకారి, నహరి గ్రామాలు మావోయిస్టులకు పట్టున్న దండకారణ్య జోన్‌లో ఉన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లాలంటే రహదారులు లేకపోవడంతో పాటు, మావోయిస్టుల భయం ఓ సవాలేనని చెప్పాలి. ఇదే క్రమంలో కూలీలకు మెడికల్ చెకప్ చేసేందుకు సమకూర్చిన వాహనంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న వారికి కూలిన ఓ కల్వర్టు బ్రేకులు వేసింది. కాకరి గ్రామంలోని కర్కా పారా సమీపంలోని ఓ కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో వారు ముందుకెలా సాగాలో అని సమాలోచనలు చేశారు. అయినా వారికి సమీప ప్రాంతాల్లో మరో దారి కనిపించలేదు.

తమ ప్రయాణం కారులో ముందుకు సాగేలా లేదని గమనించిన వైద్యుల బృందం తమ విధులు నిర్వర్తించడానికి నడుస్తూ గమ్యానికి చేరుకున్నారు. నహరి చేరుకోవడానికి వైద్యులు 6 కిలోమీటర్లు దూరం రోడ్డు సౌకర్యం లేని దట్టమైన అడవుల గుండా నడుచుకుంటూ వెళ్లారు. 150 మంది కూలీలను పరీక్షించిన వైద్యులు వారిలో కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకున్నారు. కొంతమంది కూలీలు 100 నుండి 200 కిలోమీటర్ల దూరం నడవడం వల్ల పాదాలకు వాపు వచ్చిందని డాక్టర్లకు వివరించారు. మరికొంతమంది డీహైడ్రేషన్‌కు గురయినట్టు వివరించారు. వారికి అవసరమైన వైద్య సేవలందించిన డాక్టర్లు కరోనా వ్యాధి గురించి కూలీలకు వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతంతోపాటు అసలు రహదారులే లేని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు వెళ్లి మెడికల్ టీం సేవలు అందించి రావడం ఓ సవాల్ లాగానే సాగిందని తెలిపారు. గమ్యం చేరుకుని లక్ష్యానికి అనుగుణంగా పని చేసి తిరిగి రావడం కష్టతరమే అయినా కరోనా మహమ్మారి ప్రబలితే అత్యంత ప్రమాదమన్న విషయాన్ని గమనించే సేవలందించగలిగామని చెప్పారు.

Tags: Corona Virus, Lockdown, Chhattisgarh, Telangana border, 150 people, Mirchi crop, Dantewada, Health Department, Doctors, Bastar

Next Story

Most Viewed