కేంద్రం రెండోసారి ఆర్థిక ప్యాకేజీ నిజమేనా!?

by  |
కేంద్రం రెండోసారి ఆర్థిక ప్యాకేజీ నిజమేనా!?
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది రోజుల్లో కేంద్రం రెండోసారి సుమారు రూ. లక్ష కోట్ల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఈ మొత్తం దేశంలోని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి వినియోగిస్తారని, వడ్డీ రాయితీలకు, స్థిరాస్తి రంగానికి మినహాయింపు కోసం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సమీకరణ కోసం వినియోగించేందుకు ఈ ప్యాకేజీ ప్రాధ్యాన్యత ఇవ్వనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత నెల లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం రూ. 1.7 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటిస్తూ, లక్షలాది మంది పేదలకు ఉపశమనం కలిగించేలా ప్రణాళిక అందించింది.

ఇంతకుముందు ప్యాకేజీలో ఎక్కువగా పేద, సామాన్య ప్రజలపై దృష్టి సారించిన కేంద్రం, ఈ రెండవ ప్యాకేజీలో ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలపై దృష్టి పెడుతుందని అధికారులు పేర్కొన్నారు. కొవిడ్-19తో పోరాటంలో భాగంగా లాక్‌డౌన్ వల్ల అనేక పరిశ్రమలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అందుకోసమే ఈ ప్యాకేజీ ఇవ్వనున్నట్టు వారు వివరించారు. ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నందున మోదీ ప్రభుత్వం వాటిపై దృష్టి కేంద్రీకరించిందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు పెంచేందుకు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2.9 ట్రిలియన్ డాలర్ల ఇండియా ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ అంచనాల ప్రకారం చిన్న వ్యాపారాలు నాలుగింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా కార్మికులు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 అనంతరం లాక్‌డౌన్ సమయాన్ని తగ్గించే అంశంపై పరిశీలన జరుపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు సాయం అందించేందుకు త్వరలో మరింత ఉపశమనం కలిగించేలా ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని జాతీయ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చిన్న పరిశ్రమలకు చెల్లించాల్సిన రుణాలపై ఏడాది వరకూ 2 శాతం రాయితీ ఇస్తే జీడీపీలో 0.1 శాతం వరకూ ఖర్చవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. గృహ రుణాలపై రాయితీలు ఇవ్వడం ద్వారా డిమాండ్ పెరుగుతుందని, అలాగే, బ్యాంకులకు మూలధన సమీకరణ చేయడం ద్వారా మొండి బకాయిలు తగ్గుతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా వెల్లడించింది.

ఈ ఉద్దీపనల వల్ల కేంద్రానికి ఆదాయం తగ్గుతుందని, దీంతో 2021 ఆర్థిక సంవత్సరం ఆర్థిక లోటు మొత్తం జీడీపీలో 4.8 శాతానికి తగ్గొచ్చని సంస్థ అంచనా వేసింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల లక్ష్యంగా కొత్త ప్యాకేజీలో మూలధన అవసరాలకు బ్యాంకు రుణాల పరిమితులను పెంచి, పన్ను మినహాయింపులు పొందేందుకు పరిమితులను పెంచడం, ఆదాయపు పన్ను, ఇతర బకాయిల డిపాజిట్ల కోసం నిబంధనలు సడలించడం వంటి అంశాలు ఉండోచ్చని సమాచారం. దీని గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా స్పష్టం ఇవ్వలేదు. కొంతమేరకు ఉపశమనం కలిగించేందుకు చిన్న వ్యాపారులు చెల్లించాల్సిన పన్నులను పాక్షికంగా క్లియర్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Tags : Economic Package, Coronavirus Stimulus Package, Stimulus Package, Coronavirus India, Coronavirus In Indi, Coronavirus Cases



Next Story

Most Viewed