అమిత్ షా ఫోకస్.. త్వరలోనే ఇండియాకు కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ

by  |
amith-sha
X

న్యూఢిల్లీ : దేశంలో అతి త్వరలోనే స్వదేశీ విజ్ఞానంతో పనిచేసే కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. డీఆర్‌డీఓ, ఇతర సంస్థలు కలిసి ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు శనివారం ఆయన చెప్పారు. బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సొరంగ మార్గాల, డ్రోన్ల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల, పేలుడు పదార్థాల అక్రమ రవాణా ఇటీవల విపరీతంగా పెరిగిపోయింది. వీటిని గుర్తించి అడ్డుకోవడం మనకు పెను సవాళుగా మారింది. వీటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అమిత్ షా తెలిపారు.

ఇందుకోసం త్వరలోనే సరిహద్దుల వెంట స్వదేశీ పరిజ్ఞానంతో పనిచేసే యాంటీ డ్రోన్ టెక్నాలజీలను తీసుకు వస్తామన్నారు.ఉగ్రవాదులు, శత్రుమూకలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రొబొటిక్స్ టెక్నాలజీ‌లను ఉపయోగించి దేశాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో దేశానికి సహకరించే విధంగా నిపుణులతో కలిసి కొత్త టెక్నాలజీలను గుర్తించడం ఉన్నతాధికారుల బాధ్యత అని అమిత్ షా పేర్కొన్నారు. దేశ సరిహద్దులను మరింత పటిష్టంగా చేస్తామన్నారు. అందులో భాగంగా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లో ఉన్న ఖాళీలను 2022 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. తద్వారా దేశంలోకి చొరబాట్లను అరికడతామని వెల్లడించారు.



Next Story