టీఆర్ఎస్ ఓటమికి హరీశ్‌రావే కారణమా..?

by  |
టీఆర్ఎస్ ఓటమికి హరీశ్‌రావే కారణమా..?
X

దిశ ప్రతినిధి, మెదక్ : దుబ్బాక టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అతి విశ్వాసం.. అతి ప్రగల్బాలు.. వూక దంపుడు ప్రసంగాలు ఏవీ పని చేయవని నిరూపించారు నియోజకవర్గ ప్రజలు. ఆరేండ్లలో ఓటమి ఎరుగని పార్టీ అని.. ఏ ఎన్నిక అయినా విజయం కారుదే అని.. ఉప ఎన్నికల ట్రబుల్ షూటర్ హరీశ్ రావుపై బాధ్యత వదిలేసిన కేసీఆర్.. ప్రగతి భవన్ కే పరిమితం అయ్యాడు. కానీ ఈ దఫా హరీశ్ రావుతోపాటు సెంటిమెంట్‌ను కూడా పక్కకు పెట్టి దుబ్బాక ఓటర్లు గతానికి భిన్నంగా తీర్పునిచ్చారు.

టీఆర్ఎస్ ఓవరాక్షనే ముంచిందా..?

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తన మాటలతో జనాలను ఆకట్టుకోవడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అదే బాటలో ట్రబుల్ షూటర్ హరీశ్ రావు కూడా ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సందిస్తుంటారు. కానీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో అవే మాటలు టీఆర్ఎస్ కొంపముంచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు అభివృద్ధిపై దుబ్బాక బస్టాండ్‌లో చర్చకు సిద్ధమా..? అంటూ సవాల్ విసరడంతోపాటు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అదేగాక రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బుల కట్టలు దొరికాయని హల్చల్ చేయడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయించడం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పట్ల దురుసుగా వ్యవహరించడం ఇలా అనేక విషయాలు కూడా టీఆర్ఎస్‌ను తీవ్రంగా దెబ్బకొట్టాయి. వీటికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వం యువతను పట్టించుకోక పోవడం కూడా ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. అదే కసితో దుబ్బాక ఓటర్లు బీజేపీని గెలిపించి, మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ టీఆర్ఎస్‌కు ఓటు ద్వారా సమాధానం చెప్పారు. మరోవైపు యువత, నిరుద్యోగులు, విద్యావంతులు అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేసి, బీజేపీ పక్షాన చేరారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతు‌న్నారు.

టీఆర్ఎస్‌పై స్థానిక నాయకుల్లోనూ అసంతృప్తే..

నాలుగు సార్లు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినా దుబ్బాకలో అభివృద్ధి జాడ కనిపించడం లేదని స్థానిక నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. హరీశ్ రావు సైతం అతి విశ్వాసానికి పోయారని, స్థానిక పరిస్థితులను అంచనా వేయకుండా గెలిచి తీరుతామని ధీమాతో స్థానిక నాయకులను పట్టించుకోలేదని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఉద్యమ సమయం నుంచి ఉన్న నాయకులను పక్కన పెట్టి, నిన్నా మొన్న పార్టీలోకి వచ్చిన వారిని అక్కున చేర్చుకున్నారని వాపోతున్నారు. పార్టీకోసం పనిచేసిన వారిని విస్మరించడంతో వారంతా అంతర్గతంగా బీజేపీకి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఇలా దుబ్బాకలో అధికార పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Next Story