మళ్లీ నిరాశే.. పోడు భూములపై ఏం చెప్పని మంత్రివర్గ ఉపసంఘం

by  |
మళ్లీ నిరాశే.. పోడు భూములపై ఏం చెప్పని మంత్రివర్గ ఉపసంఘం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చారు.. కూర్చున్నారు.. రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు.. కానీ ఏం తేల్చలేదు. లక్షలాది మంది ఆదివాసి, గిరిజనుల కష్టాలకు పరిష్కారాన్ని చూపించాల్సిన మంత్రివర్గ ఉపసంఘం తీరిది. ఏం చర్చించారో తెలియదు. ఏయే సమస్యలు గుర్తించారో అంతుచిక్కలేదు. కానీ, రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించామని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. పోడు భూముల సమస్యలు, పరిష్కారం, పర్యావరణ – పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అమలు, గిరిజనులు, గిరిజనేతరుల హక్కులను కాపాడడం పై కమిటీ క్షుణ్ణంగా చర్చించిందన్నారు. 24వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

మరి ఈ రెండు గంటల సమయంలో ఏమేం చర్చకు వచ్చాయి? వాటిని ఎలా పరిష్కరించాలన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, అటవీ శాఖ పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రులంతా తమ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆశతో ఎదురుచూస్తోన్న ఆదివాసి, గిరిజనానికి నిరాశే మిగిలింది.



Next Story

Most Viewed