ఆర్థిక సర్వే లేదన్న ప్రభుత్వం

by Dishanational1 |
ఆర్థిక సర్వే లేదన్న ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం రెండవ దశ చివరి బడ్జెట్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ ఏడాది ఆర్థిక సర్వే ప్రవేశపెట్టలేదు. సాధారణంగా కేంద్ర బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రధాన ఆర్థిక సలహాదారు సాంప్రదాయకంగా సమర్పించే ఈ ఆర్థిక సర్వే ఈసారి బడ్జెట్ ప్రకటనలతో పాటు లేదు. బుధవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. పార్లమెంటు సంప్రదాయం ప్రకారం, పూర్తిస్థాయి బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అయితే, మధ్యంతర లేదా తాత్కాలిక బడ్జెట్‌కు ముందు ఇది తప్పనిసరి కాదు. ఎన్నికల తర్వాత అధికారం చేపట్టబోయే ప్రభుత్వమే పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది. ఈ ఏడాది జూన్ లేదా జూలైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి కొత్త ప్రభుత్వం అవసరమైన సమగ్ర బడ్జెట్‌ తీసుకొస్తుంది. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఆర్థిక సర్వేను విడుదల చేయవచ్చని అందరూ భావించారు. అయితే, దానికి బదులుగా ప్రభుత్వం 'ఇండియన్ ఎకానమీ-ఎ రివ్యూ' పేరుతో రిపోర్ట్‌ను మాత్రమే విడుదల చేసింది. అందులో గడిచిన దశాబ్ద కాలంలో భారత ఆర్థిక ప్రస్థానం గురించి వివరించారు.



Next Story

Most Viewed