మస్క్‌ను దాటి ప్రపంచ ధనవంతుడిగా అవతరించిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

by Disha Web Desk 17 |
మస్క్‌ను దాటి ప్రపంచ ధనవంతుడిగా అవతరించిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో ఉన్నటువంటి టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ తాజాగా ఆయన తన స్థానాన్ని కోల్పోయారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం, మస్క్ నికర సంపద 197.7 బిలియన్ డాలర్లు కాగా, జెఫ్ బెజోస్ సంపద 200.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక, మూడో స్థానంలో ఫ్రెంచ్‌కు చెందిన వ్యాపార వేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్, నాలుగో స్థానంలో మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్, ఐదో స్థానంలో బిల్ గేట్స్ ఉన్నారు.

60 ఏళ్ల బెజోస్ 2021 తర్వాత బ్లూమ్‌బర్గ్ అత్యంత ధనవంతుల ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉండటం ఇదే మొదటిసారి. గత తొమ్మిది నెలలుగా ఎలాన్‌మస్క్ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, గత ఏడాది మస్క్ 31 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోగా, ఇదే సమయంలో బెజోస్ సంపద 23 బిలియన్ డాలర్లు పెరిగింది. 2022 చివరి నుంచి అమెజాన్ షేర్లు రెట్టింపు కంటే ఎక్కువ పెరగ్గా, టెస్లా షేర్ల విలువ 2021 తర్వాత 50 శాతం తగ్గింది.

బెజోస్ సంపదలో అత్యధిక భాగం అమెజాన్‌లో అతనికి ఉన్నటువంటి 9 శాతం వాటా నుండి వచ్చింది. గత నెలలో 8.5 బిలియన్ డాలర్ల విలువైన 50 మిలియన్ షేర్లను ఆయన అమ్మారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో అమెజాన్ అమ్మకాల పరంగా వృద్ధిని సాధిస్తోంది. అలాగే, షాంఘైలోని టెస్లా ఫ్యాక్టరీ నుండి ఎగుమతులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కనిష్ట స్థాయికి పడిపోయాయని ప్రాథమిక డేటా చూపించిన తర్వాత టెస్లా షేర్లు సోమవారం పడిపోయాయి. అలాగే, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న టెస్లాలో మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి అనర్హుడని డెలావేర్ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన సంపద క్షీణించింది.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 2017లో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. ఆ తరువాత జనవరి 2021లో, మస్క్ బెజోస్‌ను దాటి 195 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించాడు. తిరిగి ఇప్పుడు బెజోస్‌ తన స్థానాన్ని సంపాదించారు. బ్లూమ్‌బర్గ్ అత్యంత ధనవంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ 115 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో, అదానీ గ్రూప్ వ్యవస్థాపకులు గౌతమ్ అదానీ 104 బిలియన్ డాలర్ల సంపదతో 12వ స్థానాల్లో నిలిచారు.



Next Story

Most Viewed