- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Layoffs-2025: 6 నెలల్లో లక్ష మందిని తొలగించిన టెక్ కంపెనీలు
ముఖ్యంగా ఏఐ వినియోగం పెంచడం, మెరుగైన పనితీరు పేరుతో కంపెనీలు అనుసరిస్తున్న ధోరణిపై ఉద్యోగుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కొవిడ్ మహమ్మారి సమయంలో టెక్ రంగంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అక్కడి నుంచి టెక్ కంపెనీలు క్రమంగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, 2025 ఏడాది టెక్ రంగానికి మరో చేదు సంవత్సరంగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ వినియోగం పెంచడం, మెరుగైన పనితీరు పేరుతో కంపెనీలు అనుసరిస్తున్న ధోరణిపై ఉద్యోగుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎందుకంటే, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే అంతర్జాతీయంగా టెక్ రంగంలో ఏకంగా లక్షకు పైగా లేఆఫ్స్ జరిగాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక మాంద్యం భయాలతో పాటు వీటికి మించి కృత్రిమ మేధ(ఏఐ) కోసం కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో ఆ ప్రభావం ఉద్యోగులపై కనిపిస్తోంది. 2025, జనవరి-జూన్ మధ్య గూగుల్, మెటా, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో తొలగింపుల ప్రక్రియను చేపట్టాయి. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదిలోనే అత్యధిక మందిని ఇంటికి సాగనంపింది. తాజాగా బుధవారం కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 4 శాతానికి సమానమైన 9,100 మందికి ఉద్వాసన పలికినట్టు వెల్లడించింది. ఈ ఏడాదిలో మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ ప్రకటించిన ఇది నాలుగోసారి. తాజా తొలగింపుతో పాటు జనవరిలో 1 శాతం, మే నెలలో 6,000 మంది, జూన్‌లో 300 మందిని సాగనంపింది.
ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్ సైతం ఈ ఏడాది 20 శాతం మందిని తొలగించింది. వీరిలో క్లౌడ్ ఆర్కిటెక్చర్లతో పాటు చెప్ డిజైన్ సీనియర్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ విభాగంలోని చాలామంది ప్రభావితమయ్యారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఈ ఏడాది ఆరు నెలల్లో నాలుగుసార్లు ఉద్యోగులను తీసేసింది. వివిధ విభాగాల్లో సుమారు 14,000 మందిని తొలగించింది. ఐబీఎస్ సైతం ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 8,000 మందిని తీసేసింది. ఈ కంపెనీ హెచ్ఆర్ విభాగంలో ఎక్కువ మందిని తొలగించినట్టు సమాచారం. వారి స్థానంలో ఏఐతో పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్ ఎంట్రీ లెవల్ విభాగంలో 240 మందిని, ఫ్రెషర్స్‌లో 300 మందిని ఇంటికి పంపింది. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ సహా పలు విభాగాల్లో వందలాది మందిని, మెటా పనితీరు తగ్గిందనే కారణంతో 3,600 మందిని, హెచ్‌పీ రెండు వేలు, ఓలా 1,000 మందిని తొలగించాయి. ఇవి కాకుండా ఇంకా అనేక కంపెనీలు వివిధ విభాగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచే క్రమంలో ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి.






