కొత్త గరిష్ఠాలకు చేరిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
కొత్త గరిష్ఠాలకు చేరిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు చాలా వారాల తర్వాత కొత్త గరిష్ఠాలను తాకాయి. అంతకుముందు వరుస రెండు సెషన్లలో నష్టాలను ఎదుర్కొన్న సూచీలు శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఉదయం నుంచే మెరుగైన ర్యాలీ కొనసాగించిన తర్వాత బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు చివరి వరకు దూకుడుగానే ట్రేడయ్యాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 52 వారాల గరిష్ఠానికి, నిఫ్టీ 13 నెలల గరిష్ఠానికి చేరుకోవడం, నిఫ్టీ బ్యాంక్ సైతం కొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకడంతో స్టాక్ మార్కెట్లలో లాభాల పంట పండింది.

సెన్సెక్స్ ఇండెక్స్ కొత్త జీవితకాల గరిష్ఠాలను చేరేందుకు మరో 450 పాయింట్ల దూరంలో ఉంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు కొనసాగడం, మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు వారాంతం ర్యాలీకి కీలక మద్దతిచ్చాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,181.34 పాయింట్లు ఎగసి 61,795 వద్ద, నిఫ్టీ 321.50 పాయింట్లు పుంజుకుని 18,349 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాలు అత్యధికంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, టాటా స్టీల్, రిలయన్స్ కంపెనీల షేర్లు 2-6 శాతం మధ్య లాభపడ్డాయి.

ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మార్కెట్ ముగిసే సమయానికి రూ. 80.85 వద్ద ఉంది.

Next Story

Most Viewed