10.4 శాతం పెరగనున్న జీతాలు!

by Disha Web Desk 17 |
10.4 శాతం పెరగనున్న జీతాలు!
X

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్‌లో వివిధ రంగాల్లోని ఉద్యోగుల జీతాలు 10.4 శాతం పెరగవచ్చని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ అంచనా వేసింది. ఇది 2022లో 10.6 శాతం పెంపుతో పోలిస్తే తక్కువే. దేశంలోని 40 రంగాల్లోని వెయ్యికి పైగా కంపెనీల నుంచి వివరాలు సేకరించిన అయాన్ తాజా నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక జీతాల పెరుగుదల భారత్‌లోనే నమోదవడం విశేషం.

ఇదే సమయంలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అట్రిషన్(వలసల) రేటు 20.3 శాతంగా ఉందని, ఇది గత ఏడాది 21 శాతం తో పోలిస్తే స్వల్పంగా మాత్రమే తగ్గిందని నివేదిక తెలిపింది. అట్రిషన్ రేటు దిగిరావడం మూలంగానే జీతాల పెంపు కూడా నెమ్మదించిందని, ఈ ధోరణి రాబోయే కొద్ది నెలల పాటు కొనసాగుతుందని నివేదిక అంచనా వేసింది.

'ప్రపంచ మాంద్యం, దేశీయంగా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పటికీ 2023లో భారత్‌లో జీతాల పెంపు రెండంకెల స్థాయిలో ఉండనుంది. భారత కంపెనీలు బలమైన వ్యాపార కార్యకలాపాలను ఇది ప్రతిబింబిస్తుంది. అయితే, కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని సమీక్షించాలని, వారి ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని పరిశీలించి జీతాల పెంపు ఉండాలని' అయాన్ హెచ్ఆర్ విభాగానికి చెందిన రూపాంక్ చౌదరీ అన్నారు.

అధిక అట్రిషన్ రేటు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకున్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని జీతాలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నివేదిక ప్రకారం వచ్చే ఏడాదిలో ఐదింటిలో నాలుగు రంగాలు అత్యధిక జీతాల పెంపు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇందులో ఈ-కామర్స్ కంపెనీలు అధికంగా 12.8 శాతం జీతాలను పెంచనున్నాయి. దీని తర్వాత స్టార్టప్ కంపెనీలు 12.7 శాతం, హైటెక్/ఐటీ, ఐటీ సంబంధిత సేవల రంగాలు 11.3 శాతం, ఫైనాన్స్ కంపెనీలు 10.7 శాతం మేర జీతాలను పెంచనున్నాయి.


Next Story

Most Viewed