Silver: కొత్త రికార్డులతో బంగారం, వెండి దూకుడు

by S Gopi |   (  Updated:2026-02-11 12:24:50  IST  )

పారిశ్రామిక డిమాండ్ పెరగటం, అమెరికా డాలర్ బలహీనపడటమే వెండి రికార్డు ధరలకు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.

Silver: కొత్త రికార్డులతో బంగారం, వెండి దూకుడు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెట్టుబడిదారుల నుంచి అధిక గిరాకీకి తోడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గురువారం చారిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ఫ్యూచర్‌ ట్రేడింగ్‌లో కిలో వెండి 6 శాతం పెరిగి రూ. 4 లక్షల మైలురాయిని దాటగా, బంగారం ధర రూ. 1.79 లక్షలుగా నమోదైంది. కొనుగోలుదారుల డిమాండ్‌ కారణంగా రూ. 11 వేలకు పైగా పెరిగి, పద్ గ్రాముల బంగారం ధర రూ. 1,78,850తో కొత్త గరిష్టాలను నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోను బంగారం ఫ్యూచర్స్ తొలిసారి ఔన్స్‌కు 5,600 డాలర్ల కీలక మార్కును దాటి 5,627.50 డాలర్లను నమోదు చేశాయి. పారిశ్రామిక డిమాండ్ పెరగటం, అమెరికా డాలర్ బలహీనపడటమే వెండి రికార్డు ధరలకు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ. 11,770 పెరిగి రూ. 1,78,850కి చేరింది. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 10,800 పెరిగి రూ. 1,63,950 వద్ద ఉంది. వెండి కిలో ఏకంగా రూ. 25 వేలు పెరిగి రూ. 4.25 లక్షలుగా నమోదైంది. గ్లోబల్ మార్కెట్లో వెండి ఔన్స్ ధర 120.56 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్లు

గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన ఆర్థిక సర్వేలో దేశ జీడీపీ వృద్ధి 6.8-7.2 శాతంగా ఉంటుందని అంచనా వేయడంతో స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. దీనికి తోడు కీలక ఎల్అండ్‌టీ లాంటి బ్లూ-చిప్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్లలోనూ ర్యాలీ కొనసాగడం, ఆసియా మార్కెట్ల లాభాలు కొనసాగడం వంటి అంశాల కారణంగా మన మార్కెట్లు వరుసగా మూడో రోజు సానుకూలంగా ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 221.69 పాయింట్లు లాభపడి 82,566 వద్ద, నిఫ్టీ 76.15 పాయింట్లు పెరిగి 25,418 వద్ద ముగిశాయి. ఎల్అండ్‌టీతో పాటు యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా లాభపడిన వాటిలో ఉన్నాయి.

రూపాయి మరింత క్షీణత

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి, ప్రపంచ మార్కెట్లలో రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ మధ్య, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మరోసారి ఆల్-టైమ్ కనిష్ట స్థాయి రూ. 91.92 వద్దకు చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, విదేశీ నిధుల ఉపసంహరణ మధ్య రూపాయి ఆల్-టైమ్ ఇంట్రా-డే కనిష్టం రూ. 91.99ని తాకిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ముడిచమురు ధరల పెరుగుదల కూడా రూపాయిపై ఒత్తిడి పెంచాయన్నారు.

Next Story