అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్!

by Disha Web Desk 17 |
అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్!
X

న్యూఢిల్లీ: భారత్‌లోని టాప్-500 అత్యంత విలువైన సంస్థల జాబితాలో ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా బరంగండీ ప్రైవేట్ హురున్ ఇండియా-500 జాబితాలో, రిలయన్స్ కంపెనీ రాబడి, లాభదాయకత ఆధారంగా మెరుగైన పనితీరును కనబరుస్తోంది. రిలయన్స్ మార్కెట్ విలువ గతేడాదితో పోలిస్తే 3.6 శాతం పెరిగి రూ. 17.2 లక్షల కోట్లుగా ఉంది.

ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ విలువ 10.8 శాతం తగ్గినప్పటికీ రూ. 11.6 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో రూ. 8.3 లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రూ. 6.4 లక్షల కోట్లతో ఇన్ఫోసిస్ నాలుగో స్థానంలో, రూ. 6.3 లక్షల కోట్లతో ఐసీఐసీఐ బ్యాంక్ ఐదో స్థానంలో ఉంది.

వీటి తర్వాత టాప్-10 జాబితాలో భారతీ ఎయిర్‌టెల్(4.8 లక్షల కోట్లు) హెచ్‌డీఎఫ్‌సీ(4.4 లక్షల కోట్లు), ఐటీసీ(రూ. 4.3 లక్షల కోట్లు), అదానీ టోటల్ గ్యాస్(రూ. 3.9 లక్షల కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్(రూ. 3.8 లక్షల కోట్ల)తో ఉన్నాయి. టాప్-10 కంపెనీల మొత్తం విలువ రూ. 72 లక్షల కోట్లు కాగా, ఇది భారత జీడీపీలో 37 శాతం, బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా-500 మొత్తం విలువలో 31 శాతానికి సమానమని నివేదిక పేర్కొంది.

టాప్-10 కంపెనీల విలువ గడచిన దశాబ్ద కాలంలో 262 శాతం వృద్ధి చెందడం గమనార్హం. అన్‌లిస్టెడ్ విభాగంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్(రూ. 2.1 లక్షల కోట్ల)తో అత్యంత విలువైన అన్‌లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. దీని తర్వాత బైజూస్(రూ. 1.8 లక్షల కోట్లు), ఎన్ఎస్ఈ(రూ. 1.3 లక్షల కోట్ల)తో ఉన్నాయి.

బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా-500 జాబితాలో దాదాపు 15 శాతం(73 కంపెనీలు) ఆర్థిక సేవల రంగం నుంచే ఉన్నాయి. ఈ 500 కంపెనీలు గత ఏడాది కాలంలో దాదాపు 3.9 లక్షల ఉద్యోగాలను కల్పించాయని నివేదిక పేర్కొంది.


Next Story

Most Viewed