PwC India: పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న కోరిన పీడబ్ల్యూసీ ఇండియా

by S Gopi |

నాలుగు నుంచి మూడు శ్లాబ్‌లకు తగ్గించాలని, పన్నుల నిర్మాణంలో వివాదాలను తగ్గించవచ్చని సూచించింది.

PwC India: పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న కోరిన పీడబ్ల్యూసీ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను శ్లాబ్‌ల సంఖ్యను తగ్గించాలని, పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పీడబ్ల్యూసీ ఇండియా తన తాజా నివేదికలో తెలిపింది. దీని ద్వారా పన్ను పరిధిని విస్తరించాలని సూచిస్తూ సోమవారం నివేదికను విడుదల చేసింది. దేశంలో జీఎస్టీ విధానం ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి అనుగుణంగా మారే కీలకమైన దశలో ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో తయారీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(ప్రపంచ సామర్థ్య కేంద్రం-జీసీసీ) రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం పెరుగుతోంది. ఈ క్రమంలో సరైన నిర్ణయాలతో, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అంతర్జాతీయంగా పోటీతో కూడిన జీఎస్టీ ఫ్రేమ్‌వర్క్ అవసరం ఉందని నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుతం, జీఎస్టీ 5, 12, 18, 28 శాతం శ్లాబ్‌లను కలిగి ఉంది. లగ్జరీ, డీమెరిట్ వస్తువులపై అత్యధిక శ్లాబ్‌లో 28 శాతం పన్ను అమలవుతోంది. ప్యాక్ చేసిన ఆహారం, అవసరమైన వస్తువులు అత్యల్ప 5 శాతం శ్లాబ్‌లో ఉన్నాయి. వీటిని నాలుగు నుంచి మూడు శ్లాబ్‌లకు తగ్గించాలని, పన్నుల నిర్మాణంలో వివాదాలను తగ్గించవచ్చని సూచించింది.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాహనం, విమానయాన, ఇ-కామర్స్ వంటి రంగాల్లో ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌పై జీఎస్టీ రేటు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి వీలవుతుంది. ఈ రంగాల్లో క్రెడిట్ క్లెయిమ్‌లో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించవచ్చు. 2017, జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. కొత్త పన్ను వ్యవస్థ రావడంతో 17 రకాల స్థానిక పన్నులు, 13 సెస్‌లను ఐదు రకాల పన్ను శ్లాబ్‌లలోకి విలీనం చేశారు. ఈ ఎనిమిదేళ్లలో సగటున నెలవారీ జీఎస్టీ ఆదాయం 2017-18లో రూ. 90,000 కోట్ల నుంచి 2024-25 నాటికి ఈ సగటు రూ. 1.84 లక్షలు, 2025, ఏప్రిల్‌లో రూ. 2.37 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకుంది.

Next Story