భారత్‌లో 1.68 లక్షల కంటే ఎక్కువ కంపెనీల ఏర్పాటు

by Disha Web Desk 17 |
భారత్‌లో 1.68 లక్షల కంటే ఎక్కువ కంపెనీల ఏర్పాటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.19,774 కోట్ల మూలధనంతో దాదాపు 1,68,700 కంటే ఎక్కువ కంపెనీలు కొత్తగా ఏర్పాటయ్యాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన డేటా పేర్కొంది. గత ఏడాది రూ.18,132.16 కోట్ల చెల్లింపు మూలధనంతో 1,59,500 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఫిబ్రవరిలో అత్యధిక సంఖ్యలో వ్యాపార రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ విషయంలో మహారాష్ట్ర 18 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ 11 శాతం, ఢిల్లీ 9 శాతంతో వరుస స్థానాల్లో ఉన్నాయి.

ఒక్క ఫిబ్రవరిలో 17,260 కొత్త కంపెనీలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు నమోదైన కంపెనీలలో సగటు మూలధనం రూ.11.72 లక్షలు. ముఖ్యంగా చిన్న వ్యాపారాల నమోదులు ఎక్కువగా జరుగుతున్నాయని డేటా సూచిస్తుంది. ప్రస్తుతం, దేశంలో మొత్తంగా నమోదైన 2.64 మిలియన్ల కంపెనీల్లో మూడింట రెండు వంతులు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి.

ఫిబ్రవరిలో నమోదైన అన్ని కంపెనీలలో నాలుగో వంతు కంటే ఎక్కువ కమ్యూనిటీ, వ్యక్తిగత, సామాజిక సేవలకు చెందినవి ఉన్నాయి, అయితే 16 శాతం ట్రేడింగ్‌లో, 15 శాతం తయారీలో, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 937 కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరి చివరి నాటికి, వరుసగా రెండు సంవత్సరాలు వార్షిక రిటర్న్‌లను దాఖలు చేయని కారణంగా 26,000 కంపెనీలను అధికారిక రిజిస్ట్రీ నుంచి తొలగించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది.


Next Story

Most Viewed