భారత్‌లో టైర్ III, IV నగరాల్లో విస్తరించనున్న MG మోటార్

by Disha Web Desk 17 |
భారత్‌లో టైర్ III, IV నగరాల్లో విస్తరించనున్న MG మోటార్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ MG మోటార్, ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరించడానికి దేశంలో టైర్ III, IV నగరాల్లో కొత్తగా 100 టచ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారి బుధవారం తెలిపారు. జాయింట్ వెంచర్ ద్వారా కంపెనీ రూ.5000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గతంలో ప్రకటించగా, 2030 నాటికి దేశంలో 10 లక్షల యూనిట్ల ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా 2024-25 చివరి నాటికి 270 నగరాల్లో మొత్తం 520 సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.

దేశంలో బ్రాండ్‌ను పెంచడానికి, వినియోగదారులతో సన్నిహితంగా ఉండటం, వారి విశ్వాసం, నమ్మకం పొందేందుకు ప్రణాళికలు కలిగి ఉన్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సతీందర్ సింగ్ బజ్వా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చడానికి ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సాంప్రదాయ ఇంజిన్‌లతో సహా వివిధ సాంకేతికతలతో కూడిన వాహనాలను విక్రయిస్తాయని ఆయన చెప్పారు.

ప్రస్తుతం 380 టచ్‌పాయింట్లు ఉండగా, వీటిని ఈ ఆర్థిక సంవత్సరంలో 500కు తీసుకువస్తామని బజ్వా అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి టచ్‌పాయింట్లు దాదాపు 170 నగరాలను కవర్ చేస్తున్నాయి. MG మోటార్ 2.0లో భాగంగా, కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం 1 లక్ష యూనిట్ల నుండి 3 లక్షల వాహనాలకు పెంచుతోంది. గుజరాత్‌లోని హలోల్‌లో రెండో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒక కొత్త కారును విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.


Next Story

Most Viewed