మరో 6,000 మందిని తొలగించే యోచనలో మెటా!

by Disha Web Desk 6 |
మరో 6,000 మందిని తొలగించే యోచనలో మెటా!
X

న్యూఢిల్లీ: ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరో భారీ లేఆఫ్స్ చేపట్టనుంది. వచ్చే వారంలో కంపెనీ మరో 6,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నట్టు తెలుస్తోంది. ఈ తొలగింపులు మెటా వ్యాపార విభాగాలపై ప్రభావం చూపనున్నాయి. తాజాగా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగులతో జరిపిన కార్యక్రమంలో లేఆఫ్స్ గురించి స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి, మాంద్యం పరిణామాల మధ్య కఠిన నిర్ణయాలు తప్పవని మెటా గ్లోబల్ అఫైర్స్ అధ్యక్షుడు నిక్ క్లెగ్ అన్నారు.

కొత్తగా తొలగించబోయే ఉద్యోగుల వివరాల గురించి ముందుగా తెలియజేస్తామని, అనంతరం తొలగింపుల జాబితాలో లేని ఉద్యోగులకు సమాచారం ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. గతేడాది ఆఖరున నవంబర్‌లో 11 వేల మందిని తొలగించిన మెటా, ఆ తర్వాత దాన్ని 10 వేలకు కుదించింది. ఈ ఏడాది మార్చిలో 4 వేల మందిని, ఇప్పుడు మరో 6 వేల మంది ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది. కొత్త లేఆఫ్స్ ప్రకటనతో మెటాలో ఉన్న ఆర్థిక అనిశ్చితిని సూచిస్తోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో మరింత క్లిష్టంగా పరిస్థితులు ఉండొచ్చు, ఆ ప్రభావం సంస్థలోని వ్యాపార విభాగాలపై ఉండొచ్చని నిక్ క్లెగ్ చెప్పారు.


Next Story

Most Viewed