ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును కొనుగోలు చేసిన జేపీ మోర్గాన్!

by Disha Web Desk 17 |
ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును కొనుగోలు చేసిన జేపీ మోర్గాన్!
X

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇటీవల రెండు బ్యాంకుల పతనం తరువాత అమెరికాలో మరో బ్యాంకు దివాలా తీసింది. దాంతో 2008 నాటి లేమన్ బ్రదర్స్ స్థాయిలో మరో భారీ సంక్షోభం రాకుండా అక్కడి దిగ్గజ బ్యాంకులు పరిష్కార మార్గాలను మొదలుపెట్టాయి. అందులో భాగంగా అన్ని రకాల ప్రయాత్నాల తర్వాత ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును జేపీ మోర్గాన్ ఛేజ్ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది.

దీనికి సంబంధించి అమెరికాలోని ది ఫెడరల్ డిపాజిట్స్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) స్పష్టత ఇచ్చింది. ఫ‌స్ట్ రిప‌బ్లిక్ బ్యాంకుకు చెందిన అన్ని డిపాజిట్లు, రుణాలు, ఆస్తులను ఇకపై ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గ‌న్ చూసుకోనుందని ఓ ప్ర‌క‌ట‌న‌లో ఎఫ్‌డీఐసీ వెల్లడించింది. సోమవారం అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 84 ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుల కార్యాలయాలు జేపీ మోర్గాన్ ఛేజ్ పేరుతో తెరుచుకుంటాయని ఎఫ్‌డీఐసీ పేర్కొంది.

ఈ పరిణామాలతో అమెరికా చరిత్రలోనే దివాలా తీసిన రెండో అతిపెద్ద బ్యాంకుగా ఫస్ట్ రిపబ్లిక్ రికార్డులకెక్కింది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం 1985లో స్థాపించబడిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ఈ ఏడాది ఏప్రిల్ 13 నాటికి 229 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను, 104 బిలియన్ డాలర్ల డిపాజిట్లను కలిగి ఉంది. ఇటీవల బ్యాంకు ఖాతాదారులు 100 బిలియన్ డాలర్ల విలువైన మొత్తాలను విత్‌డ్రా చేసుకున్నారు. దానివల్ల బ్యాంక్ షేర్ ధర 75 శాతం క్షీణించింది.



Next Story

Most Viewed