బడ్జెట్‌కు ముందు భారత వృద్ధి అంచనాను పెంచిన ఐఎంఎఫ్

by Dishanational1 |
బడ్జెట్‌కు ముందు భారత వృద్ధి అంచనాను పెంచిన ఐఎంఎఫ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత వృద్ధి అంచనాను సవరించింది. జనవరి నెలకు సంబంధించిన ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో దేశీయ డిమాండ్ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో భారత వృద్ధి అంచనాను 6.7 శాతం పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపింది. ఇదివరకు 2023, అక్టోబర్‌లో 6.3 శాతంగా భారత జీడీపీ వృద్ధిని ఐఎంఎఫ్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అలాగే, 2025, 2026 సంవత్సరాలకు 6.5 శాతంతో స్థిరమైన వృద్ధి కొనసాగుతుందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. భారత ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కొన్ని గంటలు మాత్రమే ఉన్న ఈ సమయంలో ఐఎంఎఫ్ వృద్ధి అంచనాలను పెంచడం గమనార్హం. ఇదే సమయంలో ప్రస్తుత ఏడాదికి సంబంధించి ప్రపంచ వృద్ధి అంచనాను 3.1 శాతానికి పెంచినట్లు ఐఎంఎఫ్ మంగళవారం ప్రకటించింది. ద్రవ్యోల్బణం క్రమంగా క్షీణించడం, వృద్ధి కొనసాగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తుందని వివరించింది. ఇక, ఎర్ర సముద్రంలో రవాణా ఓడలపై హౌతీ దాడుల కారణంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు మరింత ఒత్తిడికి లోనవుతున్నాయని, కమొడిటీ ధరల పెరుగుదల ప్రతికూలంగా కొనసాగనుందని ఐఎంఎఫ్ పేర్కొంది. అయితే, ఇప్పటికిప్పుడు సరఫరాకు వచ్చిన ఇబ్బందులేమీ లేవని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త పియరీ-ఒలివర్ గౌరించస్ చెప్పారు.

Next Story

Most Viewed