వేగంగా పెరుగుతున్న రూ. కోటి ఇళ్ల విక్రయాలు

by Dishanational1 |
వేగంగా పెరుగుతున్న రూ. కోటి ఇళ్ల విక్రయాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఖరీదైన ఇళ్ల గిరాకీ క్రమంగా పెరుగుతోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల వాటా మొత్తం అమ్మకాల్లో 40 శాతానికి పెరిగిందని ఓ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో రూ. 50 లక్షల కంటే తక్కువ ఖరీదైన ఇళ్ల వాటా గణనీయంగా తగ్గింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ నివేదిక ప్రకారం, మొత్తం అమ్మకాల్లో ప్రీమియం ఇళ్ల వాటా ప్రతి త్రైమాసికంలోనూ పెరుగుతూనే ఉన్నాయి. 2023 కేలండర్ ఏడాది మొదటి త్రైమాసికంలో 29 శాతంగా ఉన్న రూ. కోటి ఇళ్ల వాటా రెండో త్రైమాసికంలో 31 శాతానికి, మూడో త్రైమాసికానికి 35 శాతానికి చేరాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన 34,895 ఇళ్లు విక్రయించబడ్డాయి. ఇది గతేడాది ఇదే త్రైమాసికం కంటే 51 శాతం అధికం కావడం విశేషం. అధిక డిమాండ్‌తో పాటు వినియోగదారులు దీర్ఘకాలానికి స్థిరాస్తి కోసం చేసే ఖర్చుపై బలమైన సెంటిమెంట్‌ను సూచిస్తుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, ఎండీ శిశిర్ బిజల్ తెలిపారు. సమీక్షించిన కాలంలోనే రూ. 50 లక్షల కంటే తక్కువ ఖరీదైన ఇళ్లు మొత్తం అమ్మకాల్లో 27 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గతేడాది 25,714 యూనిట్ల నుంచి 2024, మార్చిలో 23,026 యూనిట్లకు వీటి సంఖ్య తగ్గాయి. రూ. 50 లక్షల నుంచి రూ. కోటి ఇళ్లు సైతం 6 శాతం క్షీణించి 28,424 యూనిట్లకు చేరాయని నివేదిక పేర్కొంది.

Next Story