ఎన్నికల విధుల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్

by Disha Web Desk 15 |
ఎన్నికల విధుల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్
X

దిశ, మెదక్ ప్రతినిధి : ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగుల సౌకర్యార్థం స్థానిక ఆర్డీఓ కార్యాలయాల్లో, కలెక్టరేట్​లో ఈ నెల 4 నుండి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ హాలులో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కేటాయింపు, అలెర్ట్మెంట్ కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోస్టల్ బ్యాలెట్ కేటాయింపు విషయాన్ని సరైన అవగాహనతో కొనసాగించాలని, మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉద్యోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించడానికి వారికి తగు సూచనలు చేశారు.

కలెక్టర్ స్వయంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించే 13బీ, 13 సి కవర్స్ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేదాన్ని పరిశీలించారు. నియోజక వర్గానికి సంబంధించిన వారికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్, ఇతర నియోజక వర్గం, జిల్లాలకు చెందిన ఉద్యోగులకు వేర్వేరు ఫెసిలిటేషన్ సెంటర్లను నిర్వహిస్తున్నామని, ఆయా కేంద్రాలలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును కూడా వినియోగించు కుంటున్నారని చెప్పారు. దీనికి తోడుగా ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల సౌకర్యార్థం స్థానిక ఆర్డీఓ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్ లో పార్లమెంట్ నియోజక వర్గంకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఫిసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆదివారం కూడా ఫెసిలిటేషన్ సెంటర్లు పనిచేస్తాయని, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును విధిగా వినియోగించు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీ ఓ శ్రీనివాసరావు, సంబంధిత తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story