Gold: అక్షరాల రూ. లక్ష దాటిన ఆభరణాల బంగారం

by S Gopi |

మంగళవారం సాయంత్రానికి దేశ రాజధానిలో బంగారం పది గ్రాములు ఒక్కరోజే రూ. వెయ్యికి పైగా పెరిగి రూ. 1,12,655కి చేరుకుంది.

Gold: అక్షరాల రూ. లక్ష దాటిన ఆభరణాల బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు అడ్డూ అదుపు లేకుండా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ అంశాలు కూడా తోడవ్వడంతో పసిడి సరికొత్త ఆల్‌టైమ్ రికార్డులను బద్దలుకొట్టింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, మంగళవారం సాయంత్రానికి దేశ రాజధానిలో బంగారం పది గ్రాములు ఒక్కరోజే రూ. వెయ్యికి పైగా పెరిగి రూ. 1,12,655కి చేరుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో పాటు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు పెరగడం, డాలర్ కరెన్సీ బలహీనపడటంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. గతవారం విడుదలైన అమెరికా జాబ్స్ డేటా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలను పెంచింది. మరోవైపు అమెరికా వ్యాఖ్యలను లెక్కజేయకుండా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగడం కూడా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులకు మళ్లేందుకు కారణమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం మంగళవారం ఒక్కరోజే రూ. 1,360 పెరిగి రూ. 1,10,290 వద్దకు చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 1,250 పెరిగి రూ. 1,01,100 వద్ద ఉంది. వెండి ధరలు కూడా కిలో రూ. 1,40,000కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఔన్స్ బంగారం 3,659.27 డాలర్లకు చేరుకుంది.

Next Story