Gold Prices: షాకిచ్చిన బంగారం.. ఒక్కరోజే రూ. 7 వేలు జంప్

by S Gopi |   (  Updated:2026-01-21 15:21:11  IST  )

అమెరికా డాలర్ బలహీనపడటం, గ్రీన్‌ల్యాండ్ వ్యవహారంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సహా అనేక కీలక అంశాలు ప్రభావం చేస్తున్నాయి.

Gold Prices: షాకిచ్చిన బంగారం.. ఒక్కరోజే రూ. 7 వేలు జంప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం, వెండి ధరలు చూసి సామాన్యులు భయపడుతున్నారు. ప్రతి రోజు వేలల్లో పెరుగుతూ కొనాలంటేనే కంగారు పడే స్థాయికి చేరింది. ఎన్నాళ్లు ఇలా.. ఎంతకాలం పెరుగుతుంది, దిగొచ్చేదెప్పుడూ లాంటి సందేహాలను తీర్చేవారు కూడా లేరు. గత కొద్దిరోజులుగా సాగుతున్న ధరల పెరుగుదల, బుధవారం చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగాయి. ఇందుకు ప్రధానంగా అమెరికా డాలర్ బలహీనపడటం, గ్రీన్‌ల్యాండ్ వ్యవహారంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సహా అనేక కీలక అంశాలు ప్రభావం చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం పది గ్రాములు రూ. 1,56,750 వద్దకు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 6,820 పెరిగి రూ. 1,56,710కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 6,250 పెరిగి రూ. 1,43,550 వద్ద ఉంది.

బంగారంతో పాటు వెండి కూడా రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. బుధవారం పరిణామాలతో కిలో వెండి రూ. 10 వేలు పెరగడంతో రూ. 3,45,000కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర రికార్డు నెలకొల్పుతూ తొలిసారి ఔన్సుకు 4,800 డాలర్ల మార్కును దాటింది. దీంతో బంగారం పెట్టుబడిదారులకు అత్యంత నమ్మకమైన పెట్టుబడి సాధనంగా మారింది. వెండి ధర కూడా ఔన్సుకు 95.87 డాలర్లతో కొత్త రికార్డులకు చేరుకుంది.

ఎందుకు పెరుగుతున్నాయంటే..

సేఫ్-హెవెన్ డిమాండ్

భౌగోళిక రాజకీయ సవాళ్లు, అనిశ్చితి కారణంగా గ్లోబల్ మార్కెట్లతు దేశీయంగా కూడా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన నిల్వగా ఎంచుకుంటున్నారు. కొంతకాలంగా సాగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు చాలామందిని బులియన్ మార్కెట్ల వైపు నెడుతున్నాయి.

బలహీనమైన రూపాయి - డొమినో ఎఫెక్ట్

అంతర్జాతీయంగా బంగారం ధర అమెరికన్ డాలర్లలో ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడినప్పుడు, డాలర్ ధరలో పెద్దగా మార్పు లేకపోయినా, దిగుమతి చేసుకున్న బంగారం ఖరీదవుతుంది. ఫలితంగా డొమినో ఎఫెక్ట్ బంగారం, వెండి ధరల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. డోమినో ఎఫెక్ట్ అంటే ఒక సంఘటన ధరల పెరుగుదలను ప్రభావితం చేసినప్పుడు, అది వరుసగా అనేక అంశాలు జరగడానికి కారణమవుతాయి.

అధిక గ్లోబల్ డిమాండ్, పరిమిత సరఫరా

ప్రపంచవ్యాప్తంగా, కొత్త బంగారం ఉత్పత్తి తక్కువగా ఉండటం, అదే సమయంలో ఎక్కువ మంది ప్రజలు, ప్రభుత్వాలు కొనడానికి ఆసక్తి చూపడం వల్ల కూడా బంగారం ఖరీదైనదిగా మారుతోంది.

కేంద్ర బ్యాంకుల కొనుగోలు

భారత ఆర్‌బీఐతో సహా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు, కేవలం అమెరికన్ డాలర్‌పైనే ఆధారపడకుండా ఉండేందుకు అధిక మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ నిరంతర కొనుగోలు బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతోంది.

ఆసక్తికరమైన విషయం

దేశీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రజలు ధరలు వేగంగా పెరుగుతున్నాయనే భయపడి కొనుగోళ్లు పెంచడం వల్ల కూడా బంగారం పెరుగుతోంది.

రూపాయి చారిత్రాత్మక పతనం

మరోవైపు భారత కరెన్సీ రూపాయి కూడా బుధవారం చారిత్రాత్మక కనిష్ఠానికి పతనమైంది. ప్రపంచ మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి, రిస్క్-ఆఫ్ సెంటిమెంట్, కొనసాగుతున్న విదేశీ నిధుల ఉపసంహరణ ఒత్తిడితో బుధవారం అమెరికన్ కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రూపాయి 76 పైసలు పతనమై, రూ. 91.73 వద్ద రికార్డు పతనానికి చేరుకుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో కొంత కోలుకున్నప్పటికీ రూ. 91.62 వద్ద రికార్డు కనిష్టం వద్దే ఉంది.

పతనానికి ప్రధాన కారణాలు

మూలధన నిధులు, బలహీనమైన సెంటిమెంట్

ముఖ్యంగా గ్లోబల్ రిస్క్, ఇతర మార్కెట్లలో రాబడి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్, బాండ్ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరిస్తున్నారు. దీంతో వారు రూపాయి నిల్వలను అమ్మి డాలర్లను కొనుగోలు చేస్తున్నారు. అది డాలర్ డిమాండ్‌ను పెంచుతోంది, ఫలితంగా రూపాయి బలహీనపడుతోంది.

డాలర్ డిమాండ్

దిగుమతుల కోసం భారత్‌కు డాలర్లు అవసరం. ముఖ్యంగా, బంగారం దిగుమతులు, ముడి చమురు, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువుల కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో దిగుమతిదారులు పెద్ద మొత్తంలో డాలర్లను కొనుగోలు చేస్తుండటంతో, రూపాయి పడిపోతోంది.

పెరుగుతున్న వాణిజ్యం, కరెంట్ ఖాతా లోటు

ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయం కంటే దిగుమతులపై మనదేశం ఖర్చు పెరుగుతోంది. ఈ అంతరం పెరగడం అంటే వస్తున్న దానికంటే ఎక్కువ డాలర్లు అవసరం, ఇది కరెన్సీపై ఒత్తిడి పెంచుతోంది.

భౌగోళిక రాజకీయ అనిశ్చితి

ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు డాలర్, బంగారం వంటి వాటిని సురక్షిత పెట్టుబడి సాధనాలుగా మార్చాయి.

స్టాక్ మార్కెట్లు

ఓవైపు బంగారం, వెండి ధరలు పెరగడం, మరోవైపు రూపాయి క్షీణత వంటి పరిణామాల మధ్య స్టాక్ మార్కెట్లూ ఒత్తిడికి గురవుతున్నాయి. అంతకుముందు సెషన్‌లో వెయ్యికి పైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ బుధవారం ట్రేడింగ్‌లో మరో 270 పాయింట్లు క్షీణించింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక అనిశ్చితి, విదేశీ నిధుల సంహరణ, రూపాయి బలహీనత, ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, విదేశీ మార్కెట్లలోనూ తీవ్ర నష్టాలు కొనసాగడం, ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని తగ్గించడంతో వరుసగా మూడో రోజు నష్టపోయాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 270.84 పాయింట్లు పడిపోయి 81,909 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు క్షీణించి 25,157 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ లాంటి కీలక షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.

Next Story