ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు పెరుగుతున్నారు: ఆర్థిక సర్వే!

by Web Desk |
ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు పెరుగుతున్నారు: ఆర్థిక సర్వే!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో 2021-22 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారి కొనసాగుతున్న సమయంలో వ్యక్తులు వారి ఆదాయాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారనే ఆసక్తికర అంశాన్ని ఆర్థిక సర్వేలో ప్రస్తావించారు. ఆ సర్వే ప్రకారం.. స్టాక్ మార్కెట్లలోని ఈక్విటీ విభాగంలో వ్యక్తిగత పెట్టుబడిదారులు ఎక్కువగా పెరిగారని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఎన్ఎస్ఈ మొత్తం టర్నోవర్‌లో వ్యక్తిగత పెట్టుబడిదారుల వాటా 2019-20లో 38.8 శాతం నుంచి 2021, ఏప్రిల్-అక్టోబర్ నాటికి 44.7 శాతానికి పెరిగింది. కరోనా ప్రభావంతో స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు గత రెండేళ్లుగా పెరుగుతున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు.

2021 ఏప్రిల్-నవంబర్ మధ్య దాదాపు 221 లక్షల మంది వ్యక్తిగత డీమ్యాట్ అకౌంట్లను తెరిచారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో 2020, నవంబర్ చివరి నాటికి రూ. 30 లక్షల కోట్ల నుంచి 2021, నవంబర్ చివరి నాటికి 24.4 శాతం పెరిగి రూ. 37.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల(సిప్) వాటా ఇందులో అత్యధికంగా ఉంది. అలాగే, కొత్త జనరేషన్ కంపెనీలు, టెక్ స్టార్టప్‌లు, యూనికార్న్‌లతో ఐపీఓల ద్వారా 2021, ఏప్రిల్-నవంబర్ మధ్య మొత్తం 75 ఐపీఓలు జరిగాయి. వీటి ద్వారా రూ. 89,066 లక్షల కోట్ల నిధుల సమీకరణ నమోదైంది. ఇది గత దశాబ్దంలోనే అత్యధికమని ఆర్థిక సర్వే పేర్కొంది. అంతకుముందు 2020, ఏప్రిల్-నవంబర్ మధ్య 29 కంపెనీలు ఐపీఓల నుంచి రూ. 14,733 కోట్లను మాత్రమే సమీకరించాయి.



Next Story

Most Viewed