మసాలా వ్యాపారంలోకి డాబర్ ఇండియా!

by Disha Web Desk 17 |
మసాలా వ్యాపారంలోకి  డాబర్ ఇండియా!
X

ముంబై: ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియా కొత్తగా మసాలా వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు వెల్లడించింది. దీనికోసం ప్రముఖ బాద్‌షా మసాలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 51 శాతం షేర్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్టు బుధవారం ప్రకటనలో తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా డాబర్ ఇండియా తన ఫుడ్ బిజినెస్‌ను రూ. 500 కోట్లకు పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నిర్ణయంతో సుమారు రూ. 25 వేల కోట్ల విలువైన మసాలా మార్కెట్లో డాబర్ ఇండియా అడుగు పెట్టింది.

రూ. 1,152 కోట్ల విలువైన బాద్‌షా కంపెనీలో డాబర్ రూ. 587.52 కోట్లతో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇరు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, మిగిలిన 49 శాతం వాటాను డాబర్ ఇండియా ఐదేళ్ల తర్వాత కొనుగోలు చేయనుంది.

బాద్‌షా మసాలా కంపెనీ సుగంధ ద్రవ్యాలు, వివిధ మసాలాల తయారీ, మార్కెటింగ్, ఎగుమతులను నిర్వహిస్తోంది. ఆహార పదార్థాల వ్యాపారంలో మరిన్ని ఉత్పత్తులను వినియోగదారులకు అందించేందుకు ఈ కొనుగోలు జరిగిందని డాబర్ తెలిపింది.

భారత మసాలా పదార్థాల విభాగం అతిపెద్ద మార్కెట్. ఇందులో బాద్‌షా కంపెనీ కీలకం కావడంతో మా పెట్టుబడి ద్వారా వ్యాపార విస్తరణతో పాటు మరిన్ని నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చేందుకు వీలవుతుంది.

ఈ కొనుగోలుతో తమ వృద్ధి వేగవంతమవుతుంది. ఈ వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు సైతం విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నామని డాబర్ ఇండియా చైర్మన్ మోహిత్ బర్మన్ అన్నారు.



Next Story