2-3 ఏళ్లలో లక్ష ఔట్‌లెట్లకు విస్తరణ: సియెట్ టైర్స్!

by Disha Web Desk 17 |
2-3 ఏళ్లలో లక్ష ఔట్‌లెట్లకు విస్తరణ: సియెట్ టైర్స్!
X

న్యూఢిల్లీ: రాబోయే రెండు-మూడేళ్లలో రెట్టింపు స్థాయిలో ఔట్‌లెట్లను పెంచాలని భావిస్తున్నట్టు ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియెట్ వెల్లడించింది. ప్రధానంగా 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో టైర్ల అమ్మకాల నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా ఔట్‌లెట్లను లక్షకు పెంచాలనే ప్రణాళికను కలిగి ఉన్నట్టు కంపెనీ సీఓఓ అర్నబ్ బెనర్జీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

కిరాణా స్టోర్ల యజమానులు, చిన్న ఆటోమొబైల్ పరికరాల వ్యాపారులు, పంక్చర్ దుకాణాల వారితో భాగస్వామ్యం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన పేర్కొన్నారు. 25 వేల జనాభా ఉన్న ప్రాంతాలతో పాటు ద్విచక్ర వాహనాలకు అవసరమైన టైర్ల అమ్మకాలు పెంచేందుకు తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు విస్తరించే ప్రక్రియను వేగవంతం చేయనున్నామని వివరించారు.

ప్రస్తుతం కంపెనీకి 50 వేల ఔట్‌లెట్లు ఉన్నాయి. దీన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని నిర్దేశించాం. సాంప్రదాయ డీలర్‌షిప్ స్టోర్లతో సమానంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామని అర్నాబ్ బెనర్జీ తెలిపారు.

ఇప్పటికీ టైర్ల పరిశ్రమ కరోనా ముందుస్థాయికి చేరుకోలేదని, రీప్లేస్‌మెంట్ విభాగంలో కంపెనీ నెలవారీ టైర్ల అమ్మకాలు నెలకు 10 లక్షల యూనిట్ల కంటే తక్కువగానే ఉన్నాయి. గ్రామీణ డిమాండ్ పెరిగితే కంపెనీ విస్తరణ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుందని ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed