టారిఫ్ ధరల్లో సవరణ అవసరం: ఎయిర్‌టెల్ సీఈఓ!

by Disha Web Desk 17 |
టారిఫ్ ధరల్లో సవరణ అవసరం: ఎయిర్‌టెల్ సీఈఓ!
X

ముంబై: దేశీయంగా టెలికాం రంగంలో టారిఫ్ ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయని ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాల ప్రకటన సందర్భంగా మాట్లాడిన ఆయన, అత్యల్ప ధరల వల్ల తక్కువ మూలధన పెట్టుబడులపై రాబడి (ఆర్ఓసీఈ) విషయంలో ఆందోళన చెందుతున్నామని ఆయన పేర్కొన్నారు.

భారత్‌లో డిజిటల్ విస్తరణ కోసం భారీ ఎత్తున పెట్టుబడులు కావాలని, టారిఫ్ ధరలను సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎయిర్‌టెల్ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ దేశంలో అత్యుత్తమ సేవల అనుభవాన్ని అందిస్తుందని ఆయన వివరించారు.

కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రికార్డు స్థాయిలో లాభాలను సాధించింది. సమీక్షించిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్ నికర లాభం గతేడాదితో పోలిస్తే ఏకంగా 89 శాతం పెరిగి రూ. 2,145 కోట్లుగా వెల్లడించింది. 2021, ఇదే సమయంలో కంపెనీ లాభాలు రూ. 1,134 కోట్లుగా నమోదయ్యాయి.

త్రైమాసిక పరంగా కూడా ఏప్రిల్-జూన్ త్రైమాసికం కంటే 33.5 శాతం ఎక్కువ లాభాలను కంపెనీ ప్రకటించింది. ఇక, ఆదాయం కూడా 21.9 శాతం మెరుగైన వృద్ధితో రూ. 34,527 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 28,326 కోట్లుగా నమోదైనట్టు సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం(ఆర్పు) రూ. 183 నుంచి రూ. 190 కి పెరిగినట్టు వెల్లడించింది.



Next Story

Most Viewed