కోట్లాది రూపాయల లోన్ స్కామ్‌లో వాధవన్ సోదరుల బెయిల్ రద్దు

by Dishanational1 |
కోట్లాది రూపాయల లోన్ స్కామ్‌లో వాధవన్ సోదరుల బెయిల్ రద్దు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కోట్లాది రూపాయల యెస్ బ్యాంక్-డీహెచ్ఎల్ఎఫ్ లోన్ స్కామ్‌లో డీహెచ్ఎల్ఎఫ్ మాజీ ప్రమోటర్లు కపిల్ వాధవన్, అతని సోదరుడు ధీరజ్ వాధవన్‌లకు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. బెయిల్ జారీ చేసే అంశంలో ట్రయల్ కోర్టు, హైకోర్టు తప్పు చేశాయని జస్టిస్ బేలా ఎం త్రివేది, ఎస్ సి శర్మ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. నిర్దేశించిన సమయంలోనే ఛార్జీషీట్ దాఖలైన కారణంగా ప్రతివాదులు డిఫాల్ట్ బెయిల్‌ను హక్కుగా కోరడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. వాధవన్ సోదరుల రెగ్యులర్ బెయిల్‌పై ట్రయల్ కోర్టు మళ్లీ విచారణ జరుపుతుందని, తదనుగుణంగా అప్పీళ్లను మంజూరు చేయాలని ధర్మాసనం పేర్కొంది. చట్టం ప్రకారం, రిమాండ్‌కు పంపిన 60-90 రోజుల్లోగా దర్యాప్తు సంస్థ అభియోగాలను నమోదు చేయకపోతే, నిందితుడు డిఫాల్ట్ బెయిల్‌కు అర్హత ఉంటుంది. కానీ, ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన 88 రోజుల తర్వాత ఛార్జీషీట్ దాఖలైంది. గడువులోగా ఛార్జీషీట్ దాఖలు చేయలేదనే కారణంతో వాధవన్ సోదరులు బెయిల్‌కు వెళ్లగా, ట్రయల్ కోర్టు మంజూరు చేసింది. దీన్ని సీబీఐ సవాలు చేసింది. ఢిల్లీ హైకోర్టు సైతం బెయిల్‌ను సమర్థించింది.

2010-18 మధ్యకాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం డీహెచ్ఎఫ్ఎల్‌కు రూ. 42,871 కోట్ల రుణాలను ఇచ్చింది. కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లు 2019, మే నుంచి అప్పు ఎగవేస్తూ రూ. 34,614 కోట్ల వరకు ప్రజాధనాన్ని మోసం చేసినట్టు బ్యాంకు ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి యూనియన్ బ్యాంక్ ఫిర్యాదు చేయడంతో సీబీఐ విచారణ ప్రారంభించింది. డీహెచ్ఎఫ్ఎల్ ఆడిటింగ్‌లో కూడా ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు, డేటా మార్పిడి వంటి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపించింది.



Next Story

Most Viewed