- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
టాటా గ్రూప్, పాకిస్తాన్‌కు సంబంధమేంటి!
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్ మరో ఘనతను సాధించింది. ఇటీవలే రూ. 30 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి భారత చరిత్రలో మరే కంపెనీ సాధించని కొత్త రికార్డులను నమోదు చేసింది. తాజాగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)ని కూడా టాటా గ్రూప్ కంపెనీ మార్కెట్ విలువ దాటేసింది. గడిచిన ఏడాది కాలంలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా పుంజుకున్నాయి. అద్భుతమైన రాబడితో ఆ కంపెనీల ఉమ్మడి విలువ పాకిస్తాన్ మొత్తం ఆర్థికవ్యవస్థ కంటే ఎక్కువగా నమోదైంది. టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 30.3 లక్షల కోట్లకు చేరుకోగా, అప్పులు, ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న పాకిస్తాన్ జీడీపీ ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం రూ. 28.3 లక్షల కోట్లు మాత్రమే కావడం గమనార్హం.
టాటా గ్రూప్‌లో ప్రధానంగా ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ వాటాయే రూ. 15 లక్షల కోట్లు ఉంటుంది. ఈ కంపెనీ మాత్రమే పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థలో సగం ఉందని ఐఎంఎఫ్ తెలిపింది. టాటా గ్రూప్ మొత్తం విలువకు అన్ని కంపెనీ దోహదపడగా, ప్రధానంగా టీసీఎస్, టాటా మోటార్స్, ట్రెంట్ కీలక మద్దతిచ్చాయి. టాటా మోటార్స్ షేర్లు గతేడాది కాలంలో 110 శాతం, ట్రెంట్ 200 శాతం పుంజుకున్నాయి. ఇవి కాకుండా టాటా టెక్నాలజీస్, టీఆర్ఎఫ్, బెనారస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్ట్‌సన్ ఇంజినీరింగ్ వంటి షేర్లు మెరుగైన ర్యాలీ సాధించాయి. గణాంకాల ప్రకారం, టాటా గ్రూప్ స్టాక్ మార్కెట్లో కనీసం 25 కంపెనీలను కలిగి ఉండగా, వాటిలో టాటా కెమికల్స్ మాత్రమే గడిచిన ఏడాదిలో 5 శాతం క్షీణించింది.
అప్పుల ఊబిలో పాక్..
మరోవైపు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎదురైన ప్రతికూల పరిణామాలతో పాకిస్తాన్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ బయటి అప్పులు, ఈ జూలై నాటికి చెల్లించాల్సిన రూ. 2 లక్షల కోట్ల రుణాల గడువుతో ఆ దేశం కునారిల్లింది. ఇవీకాకుండా మరో రూ. 25 వేల కోట్ల విలువైన ఐఎంఎఫ్ సాయం వచ్చే నెలతో ముగియనుంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచనుంది. ప్రస్తుతం రూ. 6.65 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్య నిల్వలతో, కేవలం రెండు నెలలకు సరిపడా దిగుమతులకు మాత్రమే పాకిస్తాన్ వద్ద ఉన్నాయి. ఇక, ఆ దేశ రుణ-జీడీపీ నిష్పత్తి 70 శాతం దాటిపోయింది. వడ్డీ చెల్లింపులకు సంబంధించి ఆందోళనకర స్థాయిలో పరిస్థితి ఉందని, ఈ ఏడాది ప్రభుత్వాదాయంలో సగం వీటికే సరిపోతాయని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
పాకిస్తాన్‌కు పూర్తి భిన్నంగా భారత జీడీపీ 3.7 ట్రిలియన్ డాలర్లతో ఆ దేశం కంటే 11 రెట్లు పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న భారత్, అంచనాల ప్రకారం.. 2028 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించేందుకు సిద్ధమవుతోంది.