పండుగ సీజన్‌‌లో వినియోగదారుల ఖర్చు ఎంతో తెలుసా!

by Disha Web Desk 17 |
పండుగ సీజన్‌‌లో వినియోగదారుల ఖర్చు ఎంతో తెలుసా!
X

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. ఈ నెలాఖరు నుంచి వచ్చే నెలాఖరు వరకు కొనసాగనున్న ఈ సీజన్‌లో దేశంలోని ప్రతి మూడింటిలో ఒక కుటుంబం సగటున రూ. 10 వేలు ఖర్చు చేయనున్నట్లు ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ డిజిటల్ సంస్థ లోకల్ సర్కిల్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అయినప్పటికీ వినియోగదారుల మొత్తం ఖర్చు కరోనా మహమ్మారికి ముందు స్థాయి కంటే తక్కువగానే ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.

అదేవిధంగా ప్రస్తుతం స్టోర్లలో వినియోగదారుల రాక 20 శాతం పెరిగిందని, 49 శాతం మంది భౌతికంగా స్టోర్లకు వెళ్లి కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక తెలిపింది. ఇది గత ఏడాది ఉన్న 40 శాతం నుంచి కొంత పెరిగింది. 38 శాతం మంది ఈ-కామర్స్ లేదా స్థానిక స్టోర్ల నుంచే ఆన్‌లైన్ ద్వారా హోమ్ డెలివరీ అందుకోనున్నారు. భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గతేడాది ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టిన వారు 13 శాతం నమోదవగా, ఈసారి ఇది 5 శాతానికి పడిపోయింది.

కరోనా మహమ్మారి తగ్గినప్పటికీ ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్న కారణంగా 2019 సమయంలో పండుగ సీజన్‌కు వినియోగదారుల మొత్తం ఖర్చు రూ. 3 లక్షల కోట్లు ఉండగా, ఈసారి ఇది రూ. 2.6 లక్షల కోట్లకు తగ్గనుందని సర్వే అంచనా వేసింది.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 35 శాతం మంది పండుగ కోసం లైటింగ్, పూజా సామాగ్రి, దీపాలు వంటి వాటిని కొంటామని చెప్పగా, కిరాణా సామగి కొంటామని 26 శాతం మంది చెప్పారు. 12 శాతం మంది గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులను కొననున్నట్టు నివేదిక తెలిపింది.

Next Story