సౌత్ పోల్‌‌ ప్రయాణంతో రికార్డ్ సృష్టించనున్న భారత సంతతి మహిళ

by  |
సౌత్ పోల్‌‌ ప్రయాణంతో రికార్డ్ సృష్టించనున్న భారత సంతతి మహిళ
X

దిశ, ఫీచర్స్: బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్, కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది దక్షిణ ధృవానికి తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ‘పోలార్ ప్రీత్’గా కీర్తిపొందిన ఆమె ప్రస్తుతం అంటార్కిటికాలో జరగబోయే ట్రెక్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. -50 డిగ్రీల వాతావరణంలో 60 mph వేగంతో వీచే గాలుల మధ్య ఆదివారం ఒంటరిగా సౌత్ పోల్‌ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తన జర్నీ పూర్తయితే ఈ ఘనత సాధించిన మొదటి భారత సంతతి మహిళగా అవతరించనుంది.

కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో 90 కిలోల స్లెడ్ లాగుతూ చాంది తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. ఈ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆమె దాదాపు 27 రోజుల పాటు గ్రీన్‌ల్యాండ్‌లో శిక్షణ పొందింది. దాదాపు 50 రోజుల పాటు సాగే సౌత్ పోల్ జర్నీ కోసం ఆమె రెండేళ్ల నుంచి ప్లాన్ చేసుకుందని జాతీయ మీడియా పేర్కొంది. తన సాహస యాత్ర గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు లైవ్-ట్రాకింగ్ మ్యాప్, రోజువారీ వాయిస్ బ్లాగ్‌ను షేర్ చేయనున్న చాంది.. తన ప్రయాణానికి మద్దతివ్వాల్సిందిగా కోరుకుంటోంది.

అక్టోబర్ 21న లండన్‌లోని ‘ది షార్డ్‌’లో నిర్వహించిన లాంచ్ ఈవెంట్‌లో తన ప్రయాణ సన్నాహాలను వివరించింది. తన వస్తువులతో పాటు చిన్న కుక్కర్, ఫ్రీజ్-డ్రైడ్ ఫుడ్, ప్రత్యేక బట్టల్ని యాత్రలో తీసుకువెళ్తున్నట్లు వెల్లడించింది.

మహిళల్లో స్ఫూర్తి నింపుతుంది..

ఇది ఒంటరి సాహసయాత్ర. కానీ నేను దీన్ని ఒంటరిగా చేయడం లేదు. గమ్యం చేరుకునే వరకు చాలా మంది నాకు సహాయం చేస్తారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఇంతటి సాహసం చేస్తున్నాను. ఇది మరెంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతుంది. చరిత్ర సృష్టించడానికి ఇదే సమయం. భూమిపై అత్యంత శీతలమైన, ఎత్తయిన, పొడి గాలులతో కూడిన ఖండం అంటార్కిటికా. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివసించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఆ ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లేందుకు ప్రేరేపించింది. ఈ ప్రయాణంలో మీలో వీలైనంత ఎక్కువ మందిని నాతో తీసుకెళ్లాలనుకుంటున్నా. కాబట్టి మీరు నా ప్రయాణాన్ని అనుసరించడాన్ని ఆనందిస్తారని ఆశిస్తున్నా.
– హర్‌ప్రీత్ చాందీ

Next Story