బ్రిటానియా నికర లాభం 23 శాతం వృద్ధి

by  |
బ్రిటానియా నికర లాభం 23 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం 23 శాతం పెరిగి రూ. 495.20 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 405.37 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం ఏడాది క్రితం రూ. 3,048.84 కోట్ల నుంచి 12.1 శాతం వృద్ధితో రూ. 3,419.11 కోట్లకు చేరుకుంది. ‘కొవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, వినియోగదరుల ప్రవర్తనలో అనేక మార్పులను తీసుకొచ్చింది.

దేశీయంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ సాధారణ స్థితికి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది’ అని బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెరీ చెప్పారు. ‘ఈ త్రైమాసికంలో తాము పూర్తిస్థాయిలో ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాం. పంపిణీ సామర్థ్యంపై ప్రత్యేకంగా దృషృటి కేంద్రీకరించాం. నిరంతరం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా పంపిణీదారుల ఆరోగ్యం విషయంలో మెరుగైన శ్రద్ధ వహించడం వల్ల ప్రమోషన్లలో కరోనాకు ముందున్న సాధారణ స్థాయికి చేరుకున్నామని ఆయన వివరించారు. సవాళ్లు ఎదురైనప్పటికీ కంపెనీ పనితీరులో స్థిరత్వాన్ని కొనసాగించిందని, అనుబంధంగా ఉన్న అన్ని వ్యాపారాలు లాభదాయక వృద్ధిని ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story