టీకాల పంపిణీకి బ్రేక్.. 18 ప్లస్‌కు నో వ్యాక్సిన్

by  |
Vaccine
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా టీకాల పంపిణీకి బ్రేక్ పడింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో శనివారం నుంచి ఏ వయసువారికీ టీకాలందవు. కేంద్ర ప్రభుత్వం 18-44 ఏజ్ గ్రూపువారికి మే 1 నుంచి టీకాలు తీసుకోవచ్చంటూ ప్రకటించినా తెలంగాణలో మాత్రం ప్రారంభం కావడంలేదు. ఇప్పటివరకూ ప్రైవేటు ఆస్పత్రుల దగ్గర ఉన్న టీకా డోసులన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నుంచి అన్ని జిల్లాలకు ఆదేశాలు వెళ్ళాయి. ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం తరఫున డోసుల పంపిణీ ఉండదు. కేంద్ర ప్రభుత్వ ‘థర్డ్ ఫేజ్‘ నిర్ణయంలో భాగంగా ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా టీకా తయారీ సంస్థల నుంచే డోసులను సమకూర్చుకునే విధానం అమల్లోకి వచ్చింది. ఆ కారణంగా ఇకపైన ప్రభుత్వం నుంచి కేటాయింపులు బంద్ అయ్యాయి.

ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో, ప్రైవేటు టీకా కేంద్రాల్లో ఫస్ట్ డోస్ వేసుకున్నవారు అనివార్యంగా ప్రభుత్వ టీకా కేంద్రాలకు వచ్చి సెకండ్ డోస్ తీసుకోవాలి. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లోనూ మే నెల 1వ తేదీ నుంచి థర్డ్ ఫేజ్ టీకాల పంపిణీ ప్రారంభం కావడంలేదు. దీంతో తెలంగాణలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో 18-44 ఏజ్ గ్రూపువారికి వ్యాక్సిన్ ఇప్పట్లో సాధ్యం కాదు. కానీ 45 ప్లస్ ఏజ్ గ్రూపువారికి మాత్రం యథావిధిగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉన్న దృష్ట్యా కొత్తగా ఫస్ట్ డోస్ ఇవ్వకూడదని వైద్యారోగ్య శాఖ ఒక అభిప్రాయానికి వచ్చింది. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

కేంద్రం నుంచి తదుపరి విడత టీకాలు వచ్చేంత వరకు కేవలం సెకండ్ డోస్ మాత్రమే టీకాలు ఇవ్వాలని వైద్యారోగ్య భావిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి, వృద్ధులకు మాత్రమే అవసరాన్ని బట్టి ఫస్ట్ డోస్ ఇవ్వాలనుకుంటోంది. సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్, రెడ్డీస్ లాబ్ నుంచి కొత్తగా టీకాలను సమకూర్చుకున్న తర్వాత మాత్రమే 18-44 ఏజ్ గ్రూపువారికి టీకాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలనుకుంటోంది. అప్పటివరకు కేంద్రం నుంచి వచ్చే కోటా మేరకే 45 ప్లస్ ఏజ్ గ్రూపువారికి టీకాల పంపిణీ జరుగుతుంది. కానీ అపోలో ఆస్పత్రి మాత్రం 18-44 ఏజ్ గ్రూపువారికి శనివారం నుంచి టీకాలను ఇవ్వడం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

కొత్త స్టాకు వచ్చిన తర్వాత..

థర్డ్ ఫేజ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18-44 ఏజ్ గ్రూపువారికి టీకాలు ఇవ్వడానికి ఒక్కో డోసును ప్రైవేటు సంస్థల నుంచి రూ. 300 చొప్పున కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగానే పంపిణీ చేయనుంది. అయితే ప్రభుత్వ టీకా కేంద్రాల్లోనే కాక ప్రైవేటు ఆస్పత్రుల్లో తీసుకునేవారికి కూడా ఉచితంగానే ఇవ్వాలనుకుంటోంది. స్టాకు ఎప్పుడొస్తుందనేది ఇంకా స్పష్టత లేనందువల్ల థర్డ్ ఫేజ్‌ను ఎప్పటి నుంచి ప్రారంభించాలనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం తర్వాతనే దీనికి సంబంధించి స్పష్టత రానుంది. ఉచిత వ్యాక్సినేషన్‌తో పాటు 18-44 వయస్కులకు టీకాలను ఏ విధంగా పంపిణీ చేయాలనేదానిపై మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

తగిన నిల్వలుంటే నెలన్నరలోనే పూర్తి

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు పది వేల మంది వ్యాక్సినేటర్లు ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నారు. సుమారు వెయ్యి కేంద్రాల్లో టీకాల పంపిణీ జరుగుతోంది. కానీ గత కొన్ని రోజులుగా తగిన స్టాకు రాకపోవడంతో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్య తగ్గిపోయింది. ఇంతకాలం సగటున రెండు లక్షల మందికి టీకాలను పంపిణీ చేస్తున్నా కేంద్రం నుంచి సకాలంలో టీకాలు అందకపోవడంతో అది లక్షకు తగ్గిపోయింది. ఇకపైన టీకా తయారీ సంస్థల నుంచి వచ్చే డోసుల సంఖ్యకు అనుగుణంగా కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు మరికొంత మంది సిబ్బందిని రంగంలోకి దించనుంది. రోజుకు సగటున ఆరు లక్షల టీకాల చొప్పున రాష్ట్రంలోని మొత్తం 1.72 లక్షల మంది 18-44 ఏజ్ గ్రూపువారికి నెలన్నర రోజుల్లోనే పూర్తి చేయగలమని వైద్యారోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

నేడు, రేపు వ్యాక్సిన్ బంద్ : ప్రజారోగ్య శాఖ డైరెక్టర్

తగిన నిల్వలు లేని కారణంగా శనివారం, ఆదివారం వ్యాక్సిన్ పంపిణీ ఉండదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఎవ్వరికీ కూడా వ్యాక్సినేషన్ ఉండదని స్పష్టం చేశారు. ఏ ఏజ్ గ్రూపువారికీ టీకాలను ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఫస్ట్, సెకండ్ డోసుల పంపిణీని తాత్కాలికంగా రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మే నెల 2వ తేదీ తర్వాత వచ్చే డోసుల సంఖ్యను బట్టి ఏయే కేంద్రాల్లో ఎంత మేరకు పంపిణీ చేయాలన్నది నిర్ణయం కానుంది.


Next Story

Most Viewed