కొవాగ్జిన్ కొనుగోలులో కరప్షన్.. మోడీతో ఫోన్ కాల్ తర్వాత కుదిరిన డీల్.!

by  |
Brazil-President-Bolsonaro
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా సరఫరా కోసం కుదిరిన ఒప్పందం బ్రెజిల్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందనే కోణంలో పార్లమెంటరీ కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ (సీపీఐ) దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు సెనేటర్లు అనుమానిస్తున్నారు.

కొవాగ్జిన్ కొనుగోలు విషయంలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో ప్రత్యేక శ్రద్ధ చూపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని సెనేటర్లు ఆరోపిస్తున్నారు. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్‌ను కాదని డబ్ల్యూహెచ్‌ఓ, బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనుమతి పొందని కొవాగ్జిన్‌ కోసం ప్రభుత్వం ఏ ప్రయోజనాలు ఆశించిందని ఆరోగ్యరంగ నిపుణులు, సెనేటర్లు ప్రశ్నిస్తున్నారు.

అయితే కొవాగ్జిన్ డీల్‌కు ముందు ప్రధాని మోడీకి బోల్సోనారో ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 25న భారత్ బయోటెక్, బ్రెజిల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో బ్రెజిల్.. భారత్ బయోటెక్ వద్ద రెండు కోట్ల డోసులు కోనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 300 మిలియన్ డాలర్లు. ఈ క్రమంలో భారత్ బయోటెక్ నుంచి బ్రెజిల్ కంపెనీ ప్రెసిసా మెడికా మెంటోస్ కొవాగ్జిన్ టీకాలను సేకరించింది. ఈ మొత్తం డీల్‌లో భారత్ బయోటెక్, బ్రెజిల్ ప్రభుత్వానికి మధ్య ఓ ప్రైవేటు కంపెనీ సంధానకర్తగా ఉంది. ఈ క్రమంలోనే ప్రైవేటు కంపెనీకి వంద మిలియన్ డాలర్లు ముట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డీల్‌పై సెనెట్ కమిటీ విచారణ జరుపుతున్నది. ఈ విషయం కాస్త బయటకు రావడంతో బోల్సోనారో తీరుకు వ్యతిరేకంగా బ్రెజిల్‌లో ఆందోళనలు హోరెత్తుతున్నాయి.


Next Story

Most Viewed