రాజధాని.. రగడ రగడ!

by  |
రాజధాని.. రగడ రగడ!
X

పీలో రాజధాని అమరావతిపై రగడ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనబడటం లేదనీ, రోజుకో మలుపు తిరుగుతుందని, కేంద్రమంత్రి మాటలను వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికి కావాల్సినట్టు వారు మలుచుకుని మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కేంద్రం రాజధానిపై జోక్యం చేసుకుంటుందనీ, అంగుళం కదలనివ్వదని, సరైన సమయం కోసం వేచి చూస్తుందని చెప్పిన బీజేపీ ఏపీ లీడర్ల మాటలు అన్ని వట్టి మాటలేననీ, గట్టి పోరాటమేమి లేదని విశ్లేషిస్తున్నారు.

అమరావతే రాజధాని?

‘‘ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుందా? తీసుకుంటే స్పందనేంటి? ఈ నిర్ణయంతో రాజధానికి భూములిచ్చిన రైతులకు భారీ నష్టం కలుగుతుంది. కాబట్టి వాటి జోలికి పోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సలహా ఇస్తుందా’’ అని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నిన్న లోక్ సభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానమిస్తూ రాజధాని నిర్ణయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుందనీ, అయితే, అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23న జీవో జారీ చేసిందని తెలిపారు. అమరావతిలో ‘నిరసనలు, శాంతి భద్రతల’పై గల్లా అడిగిన ప్రశ్నకు నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తెలిపారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతే అని కేంద్రం కుండబద్దలు కొట్టిందని చెబుతున్నారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని కేంద్రమంత్రి చెప్పారు తప్ప ‘రాజధానులు’ అని చెప్పలేదని వివరించారు. రాజధాని నోటిఫై చేశాకే ప్రధాని శంకుస్థాపన చేశారని, అమరావతిని రాజధానిగా నోటిఫై చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న ప్రకటనలు బూటకమని విమర్శించారు. కేంద్ర ప్రకటన వైసీపీకి చెంపపెట్టు అని మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. వైసీపీ నాయకులు మాత్రం మూడు రాజధానులకు కేంద్రం అసలు అడ్డంకే కాదని చెబుతున్నారు.

బీజేపీ ఏపీ లీడర్లు యాడున్నారో?

రాజధానిపై ఇంత చర్చ జరుగుతుండగా నిన్న మొన్నటి దాకా అవాకులు చెవాకులు పేలిన బీజేపీ ఏపీ లీడర్లు ఇప్పుడు కనబడటం లేదని రాజధాని ప్రాంతవాసులు అంటున్నారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ ఎంపీలు చెరోమాట మాట్లాడిన సంగతి తెలిసిందే. సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందనీ, రాజధానిని అమరావతి నుంచి ఇంచు కూడా కదలనివ్వమని సుజనాచౌదరి అనగా, ఏపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందనీ, అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. ఇక బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ రాజధాని కేంద్ర పరిధిలో అంశం కాదని అంటూనే మరోసారి అవసరమైనప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్పారు. నిన్న లోక్ సభలో రాజధాని గురించి కేంద్ర మంత్రి సమాధానం తర్వాత అన్ని పార్టీలు స్పందించి ‘అమరావతి’ గురించి మాట్లాడుతున్నప్పటికీ బీజేపీ ఏపీ లీడర్లు, జనసేన ఏం మాట్లాడటం లేదు. బీజేపీ ఏపీ లీడర్లకు నిజంగా అమరావతి పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర బీజేపీపై ఒత్తిడి తెచ్చి ‘అమరావతి’నే రాజధానిగా కొనసాగించేలా ఏపీ ప్రభుత్వానికి చెప్పించేవారని పరిశీలకులు చెబుతున్నారు. అలా కాకుండా రాజకీయ ఎదుగుదల కోసమే అయితే ఎలాగూ పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయనతో కలిసి తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారని, అదే నేడు జరుగుతేందేమో అని అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

జీవో ‘రాష్ట్రానిది’ మాత్రమే..

ఇవాళ మీడియాతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, ప్రస్తుతానికి రాజధాని అమరావతే అని చెప్పారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని చెబుతూనే, రాజధాని అమరావతిలో ఉంటుందనీ, రైతులకు న్యాయం చేయాలని కోరారు. పరస్పర భిన్న ప్రకటనలు చేశారు. అయితే, బీజేపీకి అమరాతిపై పెద్దగా చిత్తశుద్ధి లేదనీ, అందుకే భిన్న వైఖరిలు వినిపిస్తోందనీ, ఇలా చెప్పడం వారికి కొత్తేమీ కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ వాళ్లు చెబుతున్నట్టు అమరావతే రాజధాని అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కాబట్టి దాన్ని మార్చి మళ్లీ ఇంకో జీవో ఇవ్వొచ్చని కేంద్ర బీజేపీ వైఖరి వైసీపీకి అనుకూలంగా ఉందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. రాజధాని రగడ ఇంకెంత కాలం కొనసాగేనో..వేచి చూడాలి.

Next Story

Most Viewed