కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్‌గా రామక్రిష్ణ..?

by  |
కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్‌గా రామక్రిష్ణ..?
X

దిశ, కంటోన్మెంట్ : కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్‌గా మాజీ ఉపాధ్యక్షుడు జె.రామక్రిష్ణ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి అనధికారికంగా సమాచారం రావడంతో రామక్రిష్ణ నివాసంలో సందడి నెలకొంది. శుక్రవారం రాత్రి మహేంద్ర హిల్స్‌లోని తన నివాసం వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకకులు,అభిమానులు చేరుకొని సంబురాలు చేసుకున్నారు. అయితే, శుక్రవారం రాత్రి వరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి నామినేటెడ్ పదవికి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని రామక్రిష్ణ వర్గం భావించింది. శని(రెండో శనివారం), ఆదివారాలు సెలవు రోజు కావడంతో సోమవారం అధికారికంగా ఉత్తర్వులు రావచ్చని వారు భావిస్తున్నారు. శనివారం ఉదయం సైతం రామక్రిష్ణను కలిసి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

అసక్తికర పోటీ..

నామినేటెడ్ పదవిపై కన్నేసిన ముగ్గురు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, భానుక నర్మద మల్లి కార్జున్, జె.రామక్రిష్ణలు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. సుధీర్ఘకాలంగా నామినేటెడ్ పదవి కోసం ఆ ముగ్గురు మాజీ ఉపాధ్యక్షులు సర్వశక్తులు ఒడ్డారు. వీరితో పాటు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు పేరు సైతం తెరపైకి వచ్చింది. స్థానిక నాయకులు ఆకుల నాగేష్, మాచర్ల శ్రీనివాస్‌లు సైతం తలపడ్డారు. అయితే, అనుహ్యంగా రామక్రిష్ణ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రామక్రిష్ణ వ్యతిరేక వర్గం మాత్రం అతనికి నామినేటెడ్ పదవి రాకుండా ఇప్పటికీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీలకు చెందిన వారు సైతం రామక్రిష్ణకు కాకుండా మిగితా ఎవ్వరికైనా ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

9 నెలలుగా..

కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి పదవీ కాలం గత ఫిబ్రవరి 10వ తేదీన ముగిసింది. గత 9 నెలలుగా స్టేషన్ కమాండర్ అధ్యక్షుడిగా, సీఈఓ సభ్యుడిగా కంటోన్మెంట్ బోర్డును రన్ చేస్తున్నారు. దేశంలోని ఇతర కంటోన్మెంట్‌లలో నామినేటెడ్ సభ్యులను నియమించిన కేంద్రం, అతిపెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు మాత్రం పెండింగ్ పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ బోర్డు సభ్యుడు విఠల్ రెడ్డి సివిల్ మెంబర్ లేకుండా బోర్డు నడుపడం నిబంధనలకు విరుద్ధమని కోర్టును అశ్రయించాడు. దీంతో సివిల్ బోర్డు సభ్యుడి నియామకం అనివార్యమైంది. దీంతో నామినేటెడ్ పదవి నియామకంపై ఉత్కంఠ నెలకొంది.అయితే, సివిల్ సభ్యుడిని సాధారణంగా ఏడాదికి మించి నియమించే అవకాశాలు ఉండవు. నామినేటెడ్ సభ్యుడిని నియమించిన తర్వాత ఏడాదిలోపు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయి.


Next Story