‘బ్యాంకులను ముంచిన వాళ్లలో బీజేపీ స్నేహితులే అధికం’

by  |
‘బ్యాంకులను ముంచిన వాళ్లలో బీజేపీ స్నేహితులే అధికం’
X

న్యూఢిల్లీ: బ్యాంకు కుంభకోణాలకు పాల్పడిన వాళ్లలో బీజేపీ స్నేహితులే అత్యధికంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. భారతీయ బ్యాంకులను మోసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న 50మంది నిందితుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ జాబితాపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భారీ ఎత్తున బ్యాంకు కుంభకోణాలకు పాల్పడిన 50మంది వివరాలను వెల్లడించాలని తాను పార్లమెంట్ సమావేశాల్లోనే అడిగానని గుర్తు చేశారు. కానీ, అందుకు ఆర్థికమంత్రి నిరాకరించారని వెల్లడించారు. అయితే, ఆర్బీఐ విడుదల చేసిన జాబితాలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సిలతో పాటు ఇతర బీజేపీ స్నేహితులు ఉన్నారనీ, ఈ కారణంగానే పార్లమెంట్‌లో వివరాలు వెల్లడించలేదని విమర్శించారు.

ప్రధాని సమాధానం చెప్పాలి: రణదీప్ సూర్జెవాల

ఇదే జాబితాపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జవాల సైతం స్పందించారు. దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోడీ, మెహుల్ చోక్సి, విజయ్ మాల్యా సహా 50మంది ఎగవేతదార్లు తీసుకున్న రూ.68,607కోట్ల రుణాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా 2014నుంచి 2019 సెప్టెంబర్ వరకూ రూ.6.66 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని పేర్కొన్నారు. ఎగవేతదార్లు తీసుకున్న అప్పులను ఎందుకు మాఫీ చేశారో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నమ్మించడం, మోసం చేయడం, పారిపోవడం.. ఇవే మోడీ ప్రభుత్వ విధానాలని మండిపడ్డారు. ఇకపై వీటిని ఏమాత్రం సహించబోమనీ, ప్రధాని కచ్చితంగా సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.

Tags: BJP Friends Among Top Bank Scammers, Rahul Gandhi, bank scammers, congress, randeep surjewaala, modi, pm,


Next Story

Most Viewed