మద్యం టెండర్లలో బడా చోర్స్.. అగ్రిమెంట్లలో చిక్కిన రిజర్వేషన్లు

by  |
మద్యం టెండర్లలో బడా చోర్స్.. అగ్రిమెంట్లలో  చిక్కిన రిజర్వేషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మద్యం టెండర్లకు “బినామీ దళితులు’ ముందుకు వస్తున్నారు. గ్రామాల నుంచి వారిని వెతికి తీసుకువస్తున్నారు. అంతేకాకుండా గౌడ కులస్థులను సైతం వెతుకుతున్నారు. ఏండ్ల నుంచి లిక్కర్​బిజినెస్​చేస్తున్న వారంతా ఇప్పుడు బినామీలపైనే ఆశలు పెట్టుకున్నారు. చాలా చోట్ల పోటీ ఎక్కువగా ఉండటం, ఈసారి రిజర్వేషన్లు కల్పించడంతో బినామీలను రంగంలోకి దింపుతున్నారు. జనరల్​స్థానాల్లో తమకు మద్యం దుకాణం వచ్చే ఆశలు లేకపోవడంతో రిజర్వేషన్ల కోటాలో బినామీలతో టెండర్లు దాఖలు చేస్తున్నారు. జనరల్ స్థానాల్లో అప్లికేషన్లు వేస్తూనే.. ఇటు రిజర్వేషన్లు కల్పించిన దుకాణాల్లో కూడా అప్లై చేస్తున్నారు.

రిజర్వేషన్లతో ఫాయిదా లేనట్టే

మద్యం దుకాణాల్లో ఈ దఫా రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రంలో దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడే ఈ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దళితబంధు సొమ్ముతో వ్యాపారం చేసుకోవాలని, బార్లు, వైన్​షాపుల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. దీంతో ముందుగా దళిత వర్గాల్లో కొంత సంబురం ఏర్పడినా.. ఆ తర్వాత ఆశల్లేకుండా పోయాయి. మరోవైపు హుజురాబాద్​నియోజకవర్గంతో పాటు మూడు చింతలపల్లిలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఖాతాల్లో జమ చేశారు. వీటి ద్వారా వ్యాపారాలు చేసుకోవచ్చంటూ సూచించారు.

ఈ పథకం విషయం ఎలా ఉన్నా.. తాజాగా మద్యం టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 18 వరకు టెండర్లను స్వీకరించనున్నారు. ఈ టెండర్లలో దళితులకు 10, గౌడ కులస్తులకు 15, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు కల్పించినా ఆ వర్గాలకు అవకాశం లేకుండానే పోతోంది. ఇప్పటికే లిక్కర్​వ్యాపారాల్లో పట్టాలు పొందిన వ్యాపారులు రిజర్వేషన్ల మాటున ఆయా వర్గాలను ఒక విధమైన మోసం చేస్తున్నట్లు గుర్తించారు.

ముందు మీరు.. వెనకంతా మాదే

రిజర్వేషన్ల కోటా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు కొంత మేరకు తక్కువగానే పోటీ ఉంటోంది. జనరల్​స్థానాల్లో మాత్రం ఎక్కువగా దాఖలవుతున్నాయి. దీంతో ఏండ్ల నుంచి లిక్కర్​వ్యాపారం చేస్తున్న వారు ఆయా ప్రాంతాల్లో తమకు అనుకూలంగా ఉండేవారు, తమ దగ్గర పని చేస్తున్నవారితో పాటుగా గ్రామాల నుంచి ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీనికి అగ్రిమెంట్​పత్రాలను సైతం రాసుకుంటున్నారు. మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తు పత్రాలు కొనుగోలు చేసి, వారే నింపి, బినామీల పేరుతో టెండర్​వేస్తున్నారు. ఒకవేళ వారికి ఈ టెండర్​దక్కితే.. ఎంతో కొంత ముట్ట చెప్పుతామని, అంతేకానీ దుకాణాలతో ఎలాంటి సంబంధం ఉండదని, కేవలం వారి పేరును వాడుకున్నందుకు ఏటా రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు ఇస్తామంటూ అగ్రిమెంట్​ చేసుకుంటున్నారు. ఒకవేళ ఏమైనా కేసులు అయితే మాత్రం మీదేసుకోవాలని, బెయిల్​వంటి వాటిని తామే చూసుకుంటామంటూ ముందుగా భరోసా ఇస్తున్నారు. కేవలం తమ దుకాణాలకు బినామీలుగా మాత్రమే ఉండాలని, వ్యాపారాలతో ఎలాంటి సంబంధం ఉండదంటూ ఒప్పందాలు చేసుకుని టెండర్లు దాఖలు చేస్తున్నారు.

మేం ఏం చేస్తాం.. అంతే చాలు

“వైన్​షాపునకు టెండర్ వేయాలంటే మాతోని అయితదా.. ప్రభుత్వం ఇచ్చిన పది లక్షలు ఇంకా ఖాతాల్లోనే ఉన్నాయి. అవి వస్తాయా.. రావా తెలియదు. మేం ఇద్దరం కలిసి ఓ హర్వెస్టర్​ కొనాలనుకున్నాం. దానికి సంబంధించిన ప్రతిపాదన ఇచ్చాం. ఇప్పుడు వైన్​షాపునకు టెండర్​ వేయాలంటూ హుజురాబాద్‌లో బ్రాందీ షాపు నడుపుతున్న ఒకాయన వచ్చి చెప్పిండు. మీ పేరు మీద వేసుకుంటామన్నాడు. ఓకే అన్నాము. ఎందుకంటే దానికి టెండర్​వేయాలంటూ మా తాహత్తు సరిపోదు. వాళ్లే వేసుకుంటామన్నారు. టెండరు వస్తే వాళ్లే నడుపుకుంటామన్నారు. నా పేరు మీద వస్తే మాత్రం ఏడాదికి రూ.80 వేలు, పండుగలకు మందు బాటిల్​పంపిస్తామన్నరు..” అంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన దళిత వర్గానికి చెందిన ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు.

మద్యం దుకాణాల్లో ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టినా వాటి నిర్వహణ, ఏర్పాటు చేసుకునేంత స్తోమత లేకపోవడంతో ఆ వర్గాలు బినామీలుగా మారుతున్నారు. వ్యాపారస్తులు కూడా ఇదే అనుకూల సమయంగా వారిని ముందు పెడుతూ వెనకుండి నడిపిస్తున్నారు. కొన్నిచోట్ల ఆర్థికంగా ఉన్న ఆ సామాజికవర్గాలకు చెందిన వారు టెండర్లు వేస్తున్నా.. పాత వ్యాపారస్తులు ఒక విధమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము ఏండ్ల నుంచి వ్యాపారం చేస్తున్నామని, ఇప్పుడు కొత్తగా వచ్చి ఎలా చేస్తారని, తమకు అప్పగిస్తే ఎంతో కొంత గుడ్​విల్​ఇస్తామంటూ సూచిస్తూ హెచ్చరిస్తున్నారు.

6 వేల దరఖాస్తులు

రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 వేల దరఖాస్తులు నమోదైనట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. మద్యం టెండర్ల దరఖాస్తులు వేసేందుకు ఆఖరి ఈ మూడు రోజులే కీలకంగా మారనున్నాయి. ఇప్పటి వరకు ఒప్పందాలు, బినామీలను సిద్ధం చేసుకున్న వ్యాపారాలు మంగళవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు ఇబ్బడిముబ్బడిగా టెండర్లు దాఖలు చేయనున్నారు. ఈ మూడు రోజుల వ్యవధిలో సుమారు 40వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన అప్లికేషన్ ఫారం ఫీజు ద్వారానే ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లకుపైగా ఆదాయం రానుంది.


Next Story

Most Viewed