సైబర్ నేరాలకు అడ్డాగా ఆ రాష్ట్రాలు

by  |
cyber crime
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘‘సర్.. మేము హల్దీరామ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ కోసం అప్లై చేసుకున్నారు కదా.. మీకు ఏజెన్సీ ఇస్తున్నాం.. రూ.20 లక్షలు డిపాజిట్ చేయండి.’’

‘‘ పాప.. డాడీ లేడా..? నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్న. కేవైసీ అప్ డేట్ చేస్తున్న. డాడీ ఫోన్‌కు ఓటీపీలు వస్తాయి. ఆ నంబర్లు చెప్పమ్మ అంటూ రూ.1.15 లక్షలు డ్రా చేశారు.’’

‘‘పాత కరెన్సీ నాణేలు, నోట్లు ఖరీదు చేస్తాం. నాణెం వెనుక వైపు దేవతా మూర్తుల బొమ్మలతో కూడిన రూ.5 నాణేన్ని రూ.5 లక్షలకు, రూ.10 నాణేన్ని రూ.10 లక్షలకు ఖరీదు చేస్తాం. దీనికి ముందుగా జీఎస్టీతోపాటు పలు రకాల ఫీజుల కోసం రూ.39వేలు చెల్లించాలి.’’

‘‘ ఓఎల్ఎక్స్‌లో మీరు పెట్టిన చీరను మీరు చెప్పిన రూ.8300లకే కొనుగోలు చేస్తాం. డబ్బులను గూగుల్ పేలో పంపిస్తా. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఆ కోడ్ స్కాన్ చేసిన వ్యక్తి ఖాతా నుంచి రూ.84 వేలు ఖాళీ..’’

ఇలా ఒకటి కాదు.. రెండు కాదు. నెలకు పదుల సంఖ్యలో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం అధికారులు, కస్టమర్లుగా మాట్లాడుతూ బ్యాంకులో ఉన్న డబ్బులను కాజేస్తున్నారు. అసలును పోలిన నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ కస్టమర్ కేర్ సర్వీస్ నంబర్లును క్రియోట్ చేస్తూ అమాయకులను అందిన కాడికి దోచుకుంటున్నారు. అయితే వీరి భారీన పడేవారిలో ఎక్కువగా చదువున్న వారు, ఉద్యోగులు, పోలీసులు ఉండడం గమనార్హం.

గతంలో సైబర్ నేరాలకు కేరాఫ్ గా నైజిరియన్లు ఉండేది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉన్న రాష్ట్రాల నుంచి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జార్ఖండ్, రాజస్థాన్, బీహార్ స్టే్ట్ల యూత్ సైబర్ నేరాల్లో ఆరితేరిపోయారు. కేవలం పదో తరగతి చదివిన వారు సైతం ఈ నేరాలను అవలీలగా చేస్తుండడం విస్మయానికి గురి చేస్తుంది. వీళ్లు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిత్యం ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల కథనం. జార్ఖండ్‌లోని జామ్‌తారా, దేవఘర్‌, రాంచీ, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌తో పాటు బీహార్‌లోని నలంద, గయా, బిహార్‌షరీఫ్‌, షేక్‌పురా జిల్లాల్లో సైబర్‌ నేరగాళ్లు అధికంగా ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.

ఈ సైబర్ నేరగాళ్లు స్థానికంగా ఉత్తమ పౌరులుగానే జీవిస్తున్నారు. సాధారణ ఉద్యోగులుగా వ్యవహరిస్తూ ఆన్ లైన్ చోరీలకు పాల్పడుతున్నారు. స్థానికంగా ఎలాంటి నేరాలు చేసినా.. పోలీసులు తమపై నిఘా పెడతారనే తెలివిగా ఈ దొంగలు అక్కడ నేరాలకు పాల్పడడం లేదని తెలిసింది. కానీ ఇతర రాష్ట్రాలనే టార్గెట్ చేసిన ఈ నయా చోరులు కేవైసీ అప్‌డేట్‌ చేయాలని, కార్డు బ్లాక్‌ అవుతుందని, OLX, Facebook, Quickr, QR Code, కస్టమర్‌ కేర్‌, లాటరీల పేర్లు చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నారు. జార్ఖండ్‌, రాజస్థాన్‌కు చెందిన సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా కొన్ని నేరాలకే పరిమితం కాగా.. బీహార్‌కు చెందిన సైబర్‌ నేరగాళ్లు మాత్రం అన్ని రకాల నేరాల్లో ఆరితేరారు. అందుకే.. ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్, క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. అలాగే ఓటీపీ, పాస్ వర్డ్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చెప్పవద్దని సూచిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story