చేప పిల్లల కుంభకోణంలో భువనగిరి ఆర్డీఓ

by  |
fish scam
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు అధికారులు, సిబ్బంది కలిసి చేప పిల్లలను తినేశారు. ఇందులో వింతేముంది? అనుకుంటున్నారా? ఇక్కడే పెద్ద చేపలు చిన్న పిల్లలనూ తినేశాయన్న ఆరోపణలపై విజిలెన్స్​అండ్​ఎన్​ఫోర్స్​మెంట్​శాఖ దర్యాప్తు చేసింది. మూడేండ్ల క్రితం జరిగిన ఈ తతంగంపై తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్​కు నివేదికను అందించారు.

మూడేండ్ల క్రితం చెరువుల్లో చేప పిల్లలు వేశారు. అయితే చేప పిల్లలను వేయకపోయిన వేసినట్లుగా, వేసినా రికార్డుల ప్రకారం లేకపోవడం వంటి వాటిని గుర్తించారు. దానికి బాధ్యులైన రెవెన్యూ అధికారులపై ఆర్టికల్​ఆఫ్​ఛార్జెస్​కింద చర్యలు తీసుకునేందుకు సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఐదు ఉత్తర్వుల్లో మాత్రమే చేప పిల్లలకు సంబంధించిన అంశాలపై అక్రమాలకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. ప్రధానంగా ఫిష్​సీడ్​సర్టిఫికేషన్​జారీ చేయడంలో అవకతవకలకు పాల్పడ్డట్లు ప్రస్తావించారు. తప్పుడు వాహనాల నంబర్లతో క్లెయిమ్​చేసినట్లుగా చెప్పారు. పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఫిష్​సీడ్​స్టాకింగ్​కమిటీ సభ్యుడిగా ఉన్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

ఇందులో ఆర్డీఓ అరుణకుమారి కూడా ఉండడం గమనార్హం. 26 మంది వీఆర్వోలు, ఒకరు రెవెన్యూ ఇన్ స్పెక్టర్, నలుగురు సబ్​రిజిస్ట్రార్లు ఉన్నారు. అయితే మత్య్సకారుల సొసైటీల రిజిస్ట్రేషన్లలోనూ అక్రమాలు చోటు చేసుకున్నందునే సబ్​రిజిస్ట్రార్లపైనా శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఉత్తర్వుల్లో మాత్రం వ్యవహారశైలిపైన ఆరోపణలు ఉన్నాయి. దాదాపు అందరూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో పని చేసిన వారే కావడం విశేషం. ప్రస్తుతం వీరిలో కొందరు మాత్రమే అదే పోస్టింగుల్లో కొనసాగుతున్నారు.

తహశీల్దార్లుగా ఉన్న వారు కొందరు పదోన్నత కూడా పొందారు. చాలా మంది బదిలీపై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక వీఆర్వో వ్యవస్థ రద్దయిన నేపధ్యంలో వారి పోస్టింగులు ఖరారు కాలేదు. కానీ అవే స్థానాల నుంచి వేతనాలు పొందుతున్నారు. ఆ కార్యాలయాల్లోనే తహశీల్దార్ల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఒకే రోజు జారీ చేసిన ఉత్తర్వులన్నీ చేప పిల్లల కుంభకోణానికి సంబంధించిన అంశానికి సంబంధించినవేనా? లేకపోతే కొన్ని మాత్రమేనా? అన్న విషయంలో క్లారిటీ రాలేదు. కానీ రెవెన్యూ ఉద్యోగులు మాత్రం అదే అంశంపై శాఖాపరమైన ఉత్తర్వులు జారీ చేసి ఉండొచ్చునని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే పోస్టులు రద్దయి, పదోన్నతులు లేని తమపై చర్యలు అమానవీయమంటున్నారు. పైగా తమ జాబ్​చార్ట్​రెవెన్యూ, భూ సంబంధ అంశాలు మాత్రమే. కానీ సంబంధం లేని చేప పిల్లల తనిఖీ బాధ్యతల అప్పగించారన్నారు. ఏదేమైనా ఉద్యోగులపై సంబంధం లేని అంశంలో చర్యలు తీసుకోవడం అన్యాయమని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్​అసోసియేషన్​రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్​ఆఫ్​ఛార్జెస్​ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ ఉద్యోగులకు జాబ్​చార్ట్​కాని పనులను అప్పగించడం, వాటిలో పొరపాట్లు జరిగాయన్న నెపంతో ఇలాంటి చర్యలకు పూనుకోవడం సమంజసం కాదన్నారు.


Next Story

Most Viewed