ఏ త్యాగానికైనా మేము ముందుంటాం: కోమటిరెడ్డి

by  |
ఏ త్యాగానికైనా మేము ముందుంటాం: కోమటిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప‌ట్టభద్రుడు సునీల్ నాయ‌క్‌ది ఆత్మహ‌త్య కాద‌ని, ముమ్మాటికీ కేసీఆర్ స‌ర్కార్ చేత‌గానిత‌నంతో చేసిన ప్రభుత్వ హ‌త్యేన‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వక‌పోవ‌డం వ‌ల్లే నిరుద్యోగులు ఆత్మహ‌త్యలు చేసుకునే ప‌రిస్థితి నెల‌కొంద‌ని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబంలో న‌లుగురికి ప‌ద‌వులు ఇచ్చిన కేసీఆర్ రాష్ట్రంలోని యువ‌త‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని మండిప‌డ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గ‌త వారం కాకతీయ యూనివ‌ర్సిటీలో సునీల్ నాయ‌క్ విషం తీసుకుని చికిత్స పొందుతూ నేడు గాంధీ ఆస్పత్రిలో మృతిచెంద‌డం బాధ‌క‌ర‌మ‌ని, సునీల్ కుటుంబం ధైర్యంగా ఉండాల‌ని వారికి అండ‌గా ఉంటానన్నారు. సునీల్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఆత్మహ‌త్య కాద‌ని ఉద్యోగాలు ఇవ్వకుండా యువ‌త‌ను వేధిస్తున్న టీఆర్ఎస్ స‌ర్కార్ చేసిన హ‌త్యేన‌ని మండిప‌డ్డారు.

యువ‌త ఎవ్వరూ ఆత్మహ‌త్యలు చేసుకోవ‌ద్దని, ప్రాణంతో ఉండి అస‌మ‌ర్థ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేంద‌కు న‌డుం బిగించాల‌ని పిలుపునిచ్చారు. అస‌లు ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ స‌భ్యుల‌ను నియ‌మించ‌కుండా నిరుద్యోగుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌ని, క‌మిష‌న్ స‌భ్యులను నియ‌మించాల‌నే సోయిలేని కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా భ‌ర్తీ చేస్తార‌ని ప్రశ్నించారు. అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ ప్రక‌టించి ఉద్యోగాల భ‌ర్తీ చేప‌డితే సునీల్ నాయ‌క్ ఆత్మహ‌త్య చేసుకునే వారు కాద‌న్నారు. ఇప్పటికే తెలంగాణ మ‌లిద‌శ పోరాటంలో 1200 మంది యువ‌త ప్రాణాలు ఆర్పించార‌ని, త్యాగాల‌తో తెచ్చుకున్న తెలంగాణ‌లో మ‌ళ్లీ యువ‌త ఆత్మహ‌త్యల‌కు పాల్పడ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు. యువ‌కులు ఎవరూ ఆత్మహ‌త్యల‌కు పాల్పడొద్దని విజ్ఞప్తిచేశారు. అంద‌రం క‌లిసి స‌ర్కార్‌పై ఒత్తిడి తెచ్చి ఉద్యోగాలు సాదిద్దామని, ఇలా ఆత్మర్పార‌ణ‌లతో కాద‌న్నారు. ఏదైనా త్యాగం చేయాల్సి వ‌స్తే నేత‌లుగా మేము ముందుంటామ‌ని కోమటిరెడ్డి ప్రకటించారు.

Next Story

Most Viewed