నయనానందం.. భాగ్య నగర్ నందనవనం

by  |
medchal news
X

దిశ, ఘట్కేసర్: వరంగల్ జాతీయ రహదారికి అనుకొని ఉన్న భాగ్యనగర్ నందనవనం పార్క్ చూపరులను ఆకట్టుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ కు ఈస్ట్ సీటీగా పిలవబడే ఉప్పల్, ఘట్కేసర్, పోచారం, నారపల్లి, ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బిజీ జీవితాలతో అలసి సొలసి పోయిన మనుషులకు ఆహ్లాదం పంచుతూ వారిలో నూతనోత్తేజం నింపుతుంది. పోచారం మున్సిపల్ పరిధి నారపల్లిలో అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్యర్యంలో ఉంది. ఈ పార్క్ మూగజీవాలకు నెలవు.. ఇక్కడ పక్షుల కిలకిల రావాలు.. మయురాల నాట్యాలు.. జింకల పరుగులు.. ఒక్కటేమిటి ఎన్నో వింతలూ, ఎన్నెన్నో విచిత్రాలు ఈ పార్క్ కు వచ్చిన వారికి కనువిందు చేస్తున్నాయి. పార్క్ లో అడుగు పెట్టింది మొదలు విడిచి వెళ్లేవరకు ఇక్కడి వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుందని, నయనానందం నందనవనం అంటు కితాబిస్తున్నారు సందర్శకులు.

ఉప్పల్ రింగ్ రోడ్ నుండి 6 కిలోమీటర్లు దూరం ఉండే ఈ పార్క్ నారపల్లిలో ఏర్పాటు చేయటంతో ఆ ప్రాంతంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరిసర ప్రాంతాల్లో కళాశాలలు అధికంగా ఉండడంతో ఆయా కళాశాలల విద్యార్థులు వారాంతంలో వచ్చి సేదతీరుతున్నారు. దీంతో పార్క్ సందడిగా ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని ఫారెస్ట్ భూమిని ప్రజల అవసరాల కోసం పార్క్ గా ఏర్పాటు చేసింది. ఈ పార్క్ లో ప్రత్యేకంగా చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, వాకర్స్ కోసం ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే వారికోసం పచ్చిక బయళ్ళు వాటిలో బెంచీలు, ఉయ్యాలలు నిర్మించారు.

ప్రత్యేక ఆకర్షణగా జింకలు, నెమళ్ళు: పార్క్ లో జింకలు నెమళ్ళు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇక్కడికి వచ్చే వారికి అవి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇవి బయటకు వెళ్లకుండా అధికారులు జాలీలు ఏర్పాటు చేశారు. ఇంతే కాకుండా పార్క్ లో కుందేళ్ళు, వివిధ జాతుల పక్షులు, జంతువులు చూపరులను ఆకట్టుకుంటుంన్నాయి

పార్క్ టైమింగ్: పార్క్ ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి వుంటుంది. ప్రవేశ రుసుం రూ. 10 నిర్ణయించారు.

పట్టణ శివారులో పార్క్ ఏర్పాటు చేయటం అభినందనీయం. రోజూ రోజుకు సందర్శకుల సంఖ్య అధికంగా ఉంది. దానికి అనుగుణంగా మంచి నీటివసతి, మరుగు దొడ్లు నిర్మాణం, క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా లైటింగ్, మ్యూజిక్ సిస్టమ్ ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సందర్శకులు కోరుతున్నారు.

Next Story

Most Viewed