‘బేతాళ్’పై రెడ్ చిల్లీస్‌కు కోర్టు రెడ్ సిగ్నల్

by  |

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిర్మాత‌గా రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై నిర్మించిన వెబ్ సిరీస్ ‘బేతాళ్‌’. ఇండియాలో విడుదలవుతున్న తొలి జాంబీ సిరీస్ కావడంతో నెటిజన్లలో దీనిపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ రోజే (మే 24) నెట్‌ ఫ్లిక్స్ వేదికగా విడుదల కావాల్సిన ఈ వెబ్ సిరీస్‌పై వివాదం చెలరేగింది.

హరర్, సస్పెన్స్ కథాంశంతో రూపొందిన ‘బేతాళ్’ సిరీస్‌కు తాము రాసిన ‘వితాళ్’ క‌థ‌కు పోలిక‌లున్నాయ‌ంటూ స్క్రీన్ రైట‌ర్స్ స‌మీర్‌, మహేశ్ ముంబై హైకోర్టును ఆశ్ర‌యించారు. ‘‘మేం మా క‌థ‌ను చాలా నిర్మాణ సంస్థ‌ల‌కు చెప్పాం. రెడ్ చిల్లీస్‌కు సంస్థకు చెప్ప‌లేదు కానీ, మా ఐడియా వారికెలా తెలిసిందో అర్థం కావ‌డం లేదు. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో ఇప్పటికే ఈ కథను రిజిస్టర్ చేసుకున్నాం. ఈ క్రమంలోనే రైట‌ర్స్ అసోసియేష‌న్‌లోనూ ఫిర్యాదు చేశాం. మా కథకు సంబంధించిన పది సన్నివేశాల వరకు ఒకేలా ఉన్నాయి’’ అన్నారు. దీంతో ‘బేతాళ్‌’ వెబ్ సిరీస్‌ ప్ర‌సారంపై ముంబై హైకోర్టు స్టే విధించింది.

ఈ వెబ్ సిరీస్‌లో వినీత్ కుమార్, అహనా కుమార్, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి కీలక పాత్రలు పోషించారు. పాట్రిక్ గ్రాహం, నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. గెటవుట్, పారానార్మల్ యాక్టివిటీ, ఇన్సైడియస్, ది ఇన్విజబుల్ మ్యాన్ తదితర హాలీవుడ్ చిత్రాలకు ప్రొడక్షన్ వర్క్ అందించిన జేసన్ బ్లమ్‌కు చెందిన ‘బ్లమ్ హౌజ్ ప్రొడక్షన్స్’ బేతాళ్ సిరీస్‌కు పనిచేస్తుండటం విశేషం.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story