ఎన్నిక అయిపోయింది.. దళితబంధు స్టార్ట్ చేయండి : బండి సంజయ్

by  |
ఎన్నిక అయిపోయింది.. దళితబంధు స్టార్ట్ చేయండి : బండి సంజయ్
X

దిశ, కరీంనగర్ సిటీ : రాష్ట్రంలో దళితుల అభివృద్ధే ధ్యేయంగా దళితబంధును ప్రవేశపెట్టినట్లు చెప్పుకుంటున్న టీఆర్ఎస్.. నేటి నుంచే హుజురాబాద్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి దళితబంధును ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఉప ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తిపోశారు.

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రపంచ దేశాలు హర్షిస్తుంటే, తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని దుయ్యబట్టారు. డబ్బుల ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే దుష్ట సాంప్రదాయానికి టీఆర్ఎస్ తెర తీసిందని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా, మొక్కవోని ధైర్యంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ప్రజలు అండగా నిలిచారని ప్రశంసించారు. పేదల పాలిట ఆప్తునిగా మారిన ఈటలకు భారీ మెజార్టీ అందించి, ధర్మం, న్యాయం గెలిపించారని అన్నారు. పిట్ట కథలతో రాజకీయాలు చేసే యత్నం బెడిసికొట్టగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, మంజూరు చేసిన నిధులు నిలిపివేసే యత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

TRS ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ, వాటిని కేంద్రంపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తోందని, వరి సాగుపై కూడా రాష్ట్ర రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గడీల పాలనకు తెర దించుతూ ప్రజావ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు గుర్తించారని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో రెండు చోట్ల పట్టం కట్టారని వెల్లడించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రగతి భవన్ వీడి, ప్రజాక్షేత్రంలోకి రావాలని సూచించారు. మొదటి విడత చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో నిరుద్యోగుల నోటిఫికేషన్లపై ఇచ్చిన అల్టిమేటమ్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 12న నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు.

రెండో విడత పాదయాత్ర ఈ నెల 21 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్‌లో అధికార పార్టీ నిర్వహించబోతున్న దీక్షా దివస్‌కు, రైతులను బెదిరించి భూమి లాక్కునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని, అవకాశవాద రాజకీయాలు మాని తెలంగాణ ప్రజల సంక్షేమంపై సర్కార్ దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి స్పీచ్‌లోని మాటలు ఉటంకిస్తూ, వీడియో విజువల్ ప్రదర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు గుగ్గిళ్ల రమేష్, ఎస్. కుమార్, బండ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed