గోదావరి వరదకు బ్రేక్.. బాబ్లీ గేట్లు మూసివేత!

by  |
గోదావరి వరదకు బ్రేక్.. బాబ్లీ గేట్లు మూసివేత!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వర ప్రదాయని శ్రీ రామ్ సాగర్‌కు 128 రోజులుగా వస్తున్న వరదకు బ్రేక్ పడనుంది. నిజామాబాద్‌లో ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఇందూర్, అదిలాబాద్ జిల్లాలో వానకాలంలో వర్షం తక్కువగా పడింది. అయినప్పటికీ మహరాష్ర్టలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 300 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి మహరాష్ర్ట నుంచి వస్తున్న వరదకు అక్కడి ప్రభుత్వం ధర్మబాద్ వద్ధ ఉన్న బాబ్లీ గేట్లను మూసి అడ్డుకట్ట వేయనుంది. గురువారం అధికారికంగా మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ గేట్లను కేంద్ర జలసంఘం సభ్యులు, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు కలిసి మూసివేయనున్నారు.

మహరాష్ర్టలోని గోదావరి నది జన్మస్థలం నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ నుంచి శ్రీరాం సాగర్ ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు వరకు చిన్న,పెద్ద, మధ్యతరహా ప్రాజెక్ట్ల్ లతోపాటు చెక్ డ్యాం కలిపి 250 వరకు నిర్మించింది అక్కడి ప్రభుత్వం. 2013లో మహాప్రభుత్వం అక్కడి రైతులకు ఈ ప్రాజెక్ట్‌ను అంకితం చేసింది. ఎగువన బాబ్లీ ప్రాజెక్టు వరకు నీటి నిలువకు అడ్డుకట్ట పడుతుండటంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్ లపై అప్పటి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

సుప్రీం తీర్పు మేరకు ప్రతి సంవత్సరం జూలై 1న బాబ్లీ ప్రాజెక్ట్‌ కు చెందిన 14 గేట్లను తెరిచి ఉంచాలని, ఆ సమయంలో వాటి పర్యవేక్షణ జరగాలని కేంద్ర జలసంఘానికి న్యాయస్థానం సూచించింది. దీంతో ప్రతి యేటా జూలై 1న ఎస్సారెస్పీ ఆధికారులు, మహారాష్ట్ర ఇరిగేషన్ ఆధికారులు, జలసంఘం ఆధికారులు కలిసి బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను జూలై 1 నుంచి ఆక్టోబర్ 28 వరకు తెరిచి వుంచుతారు. ఇవాళ్టితో గడువు తేదీ ముగియడంతో ఆక్టోబర్ 29 ఉదయం ధర్మాబాద్ వద్ద ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఆధికారులు మూసివేయనున్నారు.


Next Story

Most Viewed