సహాయక చర్యల సిబ్బంది, డీసీపీకి కూడా అస్వస్థత

by  |
సహాయక చర్యల సిబ్బంది, డీసీపీకి కూడా అస్వస్థత
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్నంలోని గోపాలపట్నం సమీపంలో ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్డీ పాలిమర్స్ కంపెనీలో లీకైన స్టిరిన్ గ్యాస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృత్యువాతపడగా… సహాయక చర్యల కోసం వచ్చిన చాలా మంది అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. రసాయనం ప్రభావంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

స్టిరిన్ గ్యాస్ 3 నుంచి 5 కిలోమీటర్ల మేరకు విస్తరించగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురై, విశాఖ కేజీహెచ్‌తో పాటు ఇతర ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. మరోవైపు సంఘటన గురించి తెలుసుకున్న కలెక్టర్, డీసీపీ తదితర అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన 200 నుంచి 300 మందిని 25 అంబులెన్సులు, ఇతర వాహనాల్లో ఆస్పత్రులకు తరలించారు.

విషవాయువుల కారణంగా అస్వస్థతకు గురైన వారితో కేజీహెచ్‌ నిండిపోయింది. ప్రధానంగా బాధితుల్లో చిన్నారుల సంఖ్య అధికంగా ఉండటంతో ఒక్కో బెడ్ ‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. 80 మందికి వెంటిలేటర్లపై చికిత్సనందిస్తున్నారు. మరో 100కు పైగా వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలన్న ఆలోచనలో ఉన్నారు.

ఈ క్రమంలో బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన పలువురు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. పలువురు పోలీసులును ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు సంఘటనా స్థలికి ముందుగా వచ్చిన డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కూడా చికిత్సనందిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags: lg polymers, rr venkatapuram,vizag,gas leak,chemical leak, kgh, helping hands get illness



Next Story

Most Viewed