గచ్చిబౌలిలో టెన్షన్.. టెన్షన్.. 43 ఇళ్ల కూల్చివేత

by  |
RDO-1
X

దిశ, శేరిలింగంపల్లి: రోడ్డు వెడల్పు కోసమంటూ గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లిలో భారీ ఎత్తున ఇళ్లను రెవెన్యూ అధికారులు కూలుస్తున్నారు. గోపన్ పల్లి చౌరస్తా నుంచి తిమ్మాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న 43 ఇళ్లను ఈ ఉదయం 7 గంటల నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దీంతో స్థానికులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశామని, స్థలాలు కోల్పోతున్నవారికి పరిహారం కూడా అందించామని, అయినా ఇళ్లను ఖాళీ చేయడంలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణాలను కూలుస్తున్నామని తెలిపారు.

భారీగా పోలీసుల మోహరింపు

ఇళ్ల కూల్చివేత్తలను స్థానికులు అడ్డుకోవడంతో గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలను మోహరించారు అధికారులు. ఎక్కడికక్కడ స్థానికులను అడ్డుకుంటూ ఎలాంటి ఆందోళనలు లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

RDO222

రోడ్డు వెడల్పులో భాగంగానే కూల్చివేతలు

గోపన్ పల్లి సర్వే నెంబర్ 34లో సుమారు 237 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా అందులో కొంతమంది కబ్జాలకు పాల్పడ్డారు. గోపన్ పల్లి చౌరస్తా నుంచి తిమ్మాపూర్ వరకు రోడ్డు వెడల్పులో భాగంగా ప్రభుత్వ భూమిలో ఉన్న 43 మంది కబ్జాదారులను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. అలాగే ముప్పా నుంచి ఉన్నా ప్రైవేట్ భూములోని 15 ఇళ్లను కూడా కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించిన వారికి స్ట్రక్చర్ వాల్యూ ఇస్తుండగా, ప్రైవేట్ స్థలాల్లో నిర్మించిన ఇళ్లకు భూమి విలువతో పాటు స్ట్రక్చర్ వాల్యూ కూడా చెల్లిస్తున్నారు. మొత్తంగా 8443 గజాల భూమిని రోడ్డు వెడల్పు కోసం తీసుకుంటున్నట్లు రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ తెలిపారు. భూమి ఆక్వజేషన్ కోసం 2018లోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, 2019 ఆగస్టులో ఈ భూములకు సంబంధించి రూ. కోటి 64 లక్షలు అథారిటీలో జమచేశామని వెల్లడించారు.

ఇద్దరికే పరిహారం..

43 మంది భూ నిర్వాసితుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే పరిహారం అందగా మిగతా 41 మందికి ఎలాంటి పరిహారం అందలేదు. ఇదే విషయంపై ఆర్డీఓ చంద్రకళ స్పందిస్తూ ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తో పాటు అధికారులు అడిగిన డాక్యుమెంట్లు సమర్పించిన వారికి పరిహారం అందించామని, మిగతా వారికి సంబంధించిన పరిహారాన్ని అథారిటీలో జమ చేశామని స్పష్టం చేశారు.

g2

పదుల సంఖ్యలో జేసీబీలు, వందల సంఖ్యలో సిబ్బంది..

ఉదయం 7 గంటల నుంచే కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ సిబ్బంది ఇందుకోసం పదుల సంఖ్యలో జేసీబీలను, వందల సంఖ్యలో సిబ్బందిని మోహరించారు. ఉదయం పూట కావడంతో ఇళ్లలో ఉన్నవారు బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయినా అధికారులు ఇళ్ల కూల్చివేతను ఆపలేదు. ఉరుకులు పరుగులతో షాపుల్లో ఉన్న సామాను ఖాళీ చేస్తూ జనాలు అనేక ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల స్వల్ప ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.

Next Story

Most Viewed