మహిళలకు రక్షణ కరువు… నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో తేటతెల్లం

by  |
మహిళలకు రక్షణ కరువు… నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో తేటతెల్లం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తెలంగాణలో రోజురోజుకూ మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. మహిళలు, యువతుల కిడ్నాప్, సెక్సువల్ హరాస్ మెంట్ మరింత ఎక్కువైంది. 2018లో తెలంగాణలో మహిళలపై 16,027 దాడులు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీ‌ఆర్‌బీ) ఇచ్చిన నివేదికలో తేలింది. 2019 లో ఈ దాడులు 18394కు పెరిగినట్లు రిపోర్టులో పేర్కొంది. 2020 నాటికి 17,791గా నమోదైనట్లు ఎన్‌సీ‌ఆర్‌బీ స్పష్టం చేసింది. మహిళలపై జరుగుతున్న ఈ నేరాల రేటు 95.4 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 49,385గా ఉన్నట్లు ఎన్ సీఆర్ బీ తెలిపింది.

తెలంగాణలో గతేడాది 14 మంది మహిళలపై లైంగికదాడి చేసి చంపేసినట్లు ఎన్‌సీ‌ఆర్‌బీ రిపోర్టులో తెలిపింది. రాష్ట్రంలో వరకట్న వేధింపులకు 175 మంది మరణించారు. ఇతర కారణాల ద్వారా ఆత్మహత్యలకు పాల్పడిన మహిళలు 404 మంది ఉన్నట్లు ఈ నివేదికలో తేలింది. ఇదిలా ఉండగా యాసిడ్ దాడి జరిగిన బాధితులు నలుగురు ఉన్నట్లు రిపోర్టులో పేర్కొంది. భర్త, అతడి కుటుంబ సభ్యుల నుంచి వేధింపులకు గురైన బాధితుల సంఖ్య 7745 మందితో దేశంలో ఐదో స్థానంలో ఉంది. కిడ్నాప్ అయిన బాధితులు 1341 మంది ఉన్నట్లు ఎన్‌సీ‌ఆర్‌బీ నివేదికలో పేర్కొంది. వివాహం చేసుకోవాలని 18 ఏళ్ల లోపు బాలికలను బలవంతం చేసిన నేరాలు 218గా నమోదయ్యాయి. యువతుల అక్రమ రవాణా నేరాల సంఖ్య 72గా నమోదైంది. లైంగికదాడి ఘటనలో 765 బాధితులు ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. ఇది 4.1 శాతంగా ఉంది. లైంగిక దాడి యత్నం 32 మందిపై జరగగా 18 ఏండ్ల లోపు ఉన్న బాలికలు ముగ్గురిపై ఉన్నట్లు ఎన్‌సీ‌ఆర్‌బీ రిపోర్టులో తేలింది.

తెలంగాణలో మహిళలను అవమానపరిచిన ఘటనలు సైతం కోకొల్లలుగా ఉండటం గమనార్హం. 2020 నాటికి 565 ఘటనల్లో 701 మంది బాధితులున్నట్లు ఎన్ సీ ఆర్ బీ రిపోర్టులో తేలింది. ఇందులో 18 ఏండ్లకు పైబడిన వారు 678 మంది ఉండగా 23 మంది మైనర్లు ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా 46.7 శాతం ఉన్నట్లు ఎన్ సీ ఆర్ బీ నివేదిక స్పష్టం చేసింది. వ్యభిచార రొంపిలోకి లాగిన ఘటనలో ఏడుగురు బాధితులు ఉన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు 45గా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో నమోదైన లైంగికదాడుల సంఖ్య 764 ఉన్నాయి. ఇందులో 18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల వరకు ఉన్నవారు 546 మంది, 30 నుంచి 45 ఏండ్ల మధ్య ఉన్నవారు 186 మంది ఉన్నారు. 45 నుంచి 60 ఏండ్ల వరకు 29 మంది, 60 ఏండ్లకు పైబడిన వారి సంఖ్య 4గా ఎన్ సీఆర్ బీ నివేదికలో పేర్కొంది. లైంగిక దాడికి పాల్పడిన 755 నేరాల్లో బాధితులకు తెలిసిన వారే ఉండటం గమనార్హం. ఇందులో 98 మంది కుటుంబీకులు మహిళలపై దాడికి యత్నించారు. 434 నేరాల్లో స్నేహితులు, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారు దాడులకు యత్నించినట్లు నివేదికలో తేలింది.


Next Story

Most Viewed