లాక్‌డౌన్ ఎఫెక్ట్: తండ్రీకొడుకు ఆత్మహత్యాయత్నం

by  |
suicide attempt
X

దిశ, కీసర: కీసరలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ మూలంగా కుటుంబ పోషణ భారమై తీవ్ర మనస్థాపానికి గురైన తండ్రీకొడుకు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. కీసర మండలంలోని బండ్లగుడ ఈడెన్ గార్డెన్‌లో దూదేకుల ప్రవీణ్ కుమార్ నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో ఏం చేయలేక, తీవ్ర మనస్థాపం చెందిన తండ్రి ప్రవీణ్ కుమార్, కుమారుడు యశ్వంత్‌తో కలిసి చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. శనివారం ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఇరువురు ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి, వెంటనే అంబులెన్సుకు సమాచారం అందజేశారు. ప్రస్తుతం తండ్రీకొడుకు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.



Next Story

Most Viewed