ఆస్ట్రా జెనెకా టీకా సైడ్ ఎఫెక్ట్స్‌పై రివ్యూ

by  |
ఆస్ట్రా జెనెకా టీకా సైడ్ ఎఫెక్ట్స్‌పై రివ్యూ
X

న్యూఢిల్లీ : ఆస్ట్రా జెనెకా టీకాతో లబ్దిదారుల్లో రక్తం గడ్డకడుతున్నదని యూరప్ దేశాలు ఆందోళనలు వక్తం చేస్తున్నాయి. డెన్మార్క్, నార్వే, ఐస్‌లాండ్, థాయ్‌లాండ్ సహా పలుదేశాలు ఈ టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపేశాయి. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా ఆస్ట్రా జెనెకా టీకా తీసుకున్న లబ్దిదారుల్లో సైడ్ ఎఫెక్ట్‌లను పున:పరిశీలించనున్నట్టు తెలిపింది. టీకా పంపిణీ తర్వాత ఏర్పడ్డ అన్ని దుష్ప్రభావాలను పరిశీలిస్తామని, ముఖ్యంగా మరణాలు, హాస్పటిల్‌లో చేరిన కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కొవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఎన్‌కే అరోరా వివరించారు. సీరియస్ ఘటనలేవీ లేకుంటే ఈ ఇష్యూను వదిలిపెడతామని తెలిపారు. అయితే, ఈ విషయంపై ఆందోళనపడాల్సిన పనిలేదని వివరించారు. ఎందుకంటే టీకా పంపిణీలో మనదేశంలో దుష్ప్రభావాల రేటు అతి స్వల్పంగా ఉన్నదని అన్నారు. వీటిలోనే బ్లడ్ క్లాట్‌కు సంబంధించిన కేసులను పరిశీలిస్తామని తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత లబ్దిదారుల మరణాలు శుక్రవారం నాటికి 60కి చేరాయని, వీటన్నింటికీ టీకాతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీకా(కొవిషీల్డ్)తోపాటు భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ మనదేశంలో పంపిణీ చేస్తున్నారు. యూరప్ దేశాల్లో ఆందోళనతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ఓ ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రా జెనెకా సురక్షితమని, దాని వల్లే ఆందోళన పడాల్సిన పని లేదని వివరించింది. అంతేకాదు, టీకా పంపిణీని కొనసాగించవచ్చునని సూచించింది.



Next Story

Most Viewed